Hyderabad: హిందూ మతంలో విద్వేషానికి తావులేదు..
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:13 AM
హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. హిందూ మతం ఒక జీవన విధానం కాదని, అది విభిన్న జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని తెలిపారు.
కులాన్ని వదలకుండా హిందువు కాలేరు
అనేక విలువల కలయిక హిందూమతం
రాజకీయ లబ్ధికి హిందూమతాన్ని వాడుకోవద్దు
ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, పీఠాధిపతులు
హైదరాబాద్ సిటీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. హిందూ మతం ఒక జీవన విధానం కాదని, అది విభిన్న జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని తెలిపారు. మసీదులు కూల్చేవారు, పరమతాన్ని ద్వేషించేవారు, ఇతర మతాల సంస్కృతి, సంప్రదాయాలను దూషించేవారు నిజమైన హిందువులు కారంటూ పరోక్షంగా ‘బీజేపీ-ఆరెస్సెస్’ తీరును విమర్శించారు. ‘జైశ్రీరాం’ పవిత్ర నామ స్మరణను ఇతర మతస్థులను కొట్టి చంపడానికి ఉపయోగించడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. బహుళత్వం, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, ధిక్కారం, హేతుత్వం, ఏకాత్మ భావన తదితర మహోన్నత ఆలోచనలు, విలువల సమాహారమే హిందూ మతమని ముక్తకంఠంతో నినదించారు.
సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా ‘అన్నమయ్య కళాక్షేత్రం’, ‘హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని బిర్లాసైన్స్ సెంటర్‌లో ‘ద్వేషం, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూమతం’ నినాదంతో సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నమయ్య పదకవితా వైభవం వ్యాస సంకలనం ‘అందరికీ శ్రీహరే అంతరాత్మ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 8వతరం మునిమనవడు వీరంభట్లయ్య, అచల తత్వయోగి దున్న ఇద్దాసు పీఠాధిపతి దున్న విశ్వాదాసు, అలేఖ మహిమా ధర్మ అవధూత వల్లభానంద మహరాజ్, దుర్గాదేవి పీఠం దత్తానంద స్వామి, బాలకృష్ణమయానంద, మల్లిసాల స్వామీజీ యోగి సిద్ధరామయ్య, అచలయోగిని మాతా నిశ్చలాంబ, ఆర్యసమాజ్ ప్రతినిధులు అరవింద శాస్త్రి, వసుధ శర్మ, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు దరూరి నరసింహాచార్యులు, దేవేంద్ర, విజయేంద్ర సాధువులు, యోగి ప్రభాకర్ గురూజీ తదితరులంతా మాట్లాడారు.
విశాల భావాలు కలిగిన హిందూమతాన్ని ఒక చట్రంలో ఇరికించి, దాని స్ఫూర్తిని వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అవధూత వల్లభానంద మహరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కులాన్ని వదిలేయకుండా హిందూమతాన్ని ప్రేమించడం అసాధ్యమని సాధు త్రినాథదాస్ అభిప్రాయపడ్డారు. గోరక్షణ పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ‘ద్వేషం మతాల్లో లేదు, వాటిని స్థాపించిన మనుషుల్లో ఉంది’ అని యోగి సిద్ధరామయ్య అన్నారు. విద్వేషం, అసహనం, అసమానత్వం, సంకుచిత తత్వం లాంటి అవలక్షణాలేవీ భారతీయ తాత్వికతలో లేవని, శాంతియుత సహజీవనమే హిందూ ఆచరణ అని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ చెప్పారు. మతం పేరుతో మనుషులను విడదీయడాన్ని ఏ ధర్మమూ అంగీకరించదని యోగి ప్రభాకర్ గురూజీ ఉద్ఘాటించారు.
మతం పూర్తిగా వ్యక్తిగతమని, దాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం సరికాదని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్‌స్వామి అన్నారు. ఇప్పటికిప్పుడు హిందూమతానికి ముప్పు వాటిల్లిందన్న ప్రచారంలో వాస్తవంలేదని, అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పరమత ద్వేషంతో హిందూమతాన్ని ఏకోన్ముఖత వైపు తీసుకెళ్లేందుకు సాగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకు ఈ సమ్మేళనం ద్వారా సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లనున్నట్లు సభాధ్యక్షత వహించిన విజయవిహారం రమణమూర్తి ప్రకటించారు. ‘‘తిరుమలలో కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని టీటీడీ యథాతథంగా నిర్మించాలి. హిందూ మతాన్ని రాజకీయ లబ్ధికోసం వాడకూడదు. మతంపేరుతో ద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు’’ తదితర అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.