Share News

Nalgonda : ఆస్పత్రిలో ఇతర శాఖల అధికారుల తనిఖీలేంటి?

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:41 AM

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రిలో ఇతర శాఖల అధికారుల జోక్యాన్ని నిరసిస్తూ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, కార్మికులు సమ్మెకు దిగారు.

Nalgonda : ఆస్పత్రిలో ఇతర శాఖల అధికారుల తనిఖీలేంటి?

  • నల్లగొండ కలెక్టర్‌ ఉత్తర్వులను నిరసిస్తూ..

  • జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన

నల్లగొండ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రిలో ఇతర శాఖల అధికారుల జోక్యాన్ని నిరసిస్తూ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, కార్మికులు సమ్మెకు దిగారు. వైద్యులు సహా సిబ్బంది గురువారం ఉదయం 11 గంటల సమయంలో విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. అదనపు కలెక్టర్‌(స్థానికసంస్థలు) పూర్ణచంద్రను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆస్పత్రి వద్దకు పంపించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందికి అదనపు కలెక్టర్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో ఆయన వెళ్లిపోయారు.


డాక్టర్లు, సిబ్బంది ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం మరోసారి నిరసనకు దిగాలని నిర్ణయించుకున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనను విరమించారు. కాగా, డాక్టర్లు, సిబ్బంది ఆందోళనపై స్పందించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి.. డాక్టర్ల పనితీరుపైనా, వారి వృత్తిపరమైన విషయాల్లో ఏ శాఖ అధికారులు జోక్యం చేసుకోవడం లేదని, ఎలాంటి అజమాయిషీ చేయడం లేదని వెల్లడించారు.

Updated Date - Jun 28 , 2024 | 03:41 AM