Share News

Hyderabad : మాజీ డీహెచ్‌ గడల బదిలీ!

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:35 AM

ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనకు స్థానచలనం కల్పించారు. ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి హోదాలో ఉన్నారు.

Hyderabad : మాజీ డీహెచ్‌ గడల బదిలీ!

  • పలువురు డీఎంహెచ్‌వోలకూ స్థాన చలనం

  • హైదరాబాద్‌లో ఏళ్లతరబడి ఉన్నవారు ఇప్పటికీ అక్కడే!

  • ఇప్పటికే వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు.. ఆమోదించని రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనకు స్థానచలనం కల్పించారు. ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి హోదాలో ఉన్నారు. డీహెచ్‌ పోస్టు నుంచి తప్పుకొన్న తర్వాత ఆయన విధులకు హాజరుకాలేదు.

స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం ఆమోదించలేదు. రెండోసారి వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పందించలేదు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం (లాంగ్‌ స్టాండింగ్‌) ఉన్నారనే కారణంతో బదిలీల జాబితాలో గడల పేరును కూడా చేర్చారు.

శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించగా ఆయన హాజరుకాలేదు. దీంతో ఆ తర్వాత వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కేడర్‌లో నిర్మల్‌, మహబూబాబాద్‌ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు జిల్లాల్లో ఒక చోటకు పంపే అవకాశం ఉంది. సంబంధిత ఉత్తర్వులు నేడో, రేపో వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇక అదే హోదాలో 10 మంది ఉండగా.. 40 శాతం బదిలీల్లో భాగంగా నలుగురిని బదిలీ చేశారు. జాబితాలో తొలిపేరు గడల శ్రీనివాసరావుదే. మరోవైపు నిర్మల్‌ ఏడీపీహెచ్‌వోగా ఉంటూ శేరిలింగంపల్లి డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న మల్లికార్జున్‌ను జనగామకు బదిలీ చేశారు.


పలువురు డీఎంహెచ్‌వోల బదిలీ

సుదీర్ఘకాలంగా ఒకే చోట సివిల్‌ సర్జన్లుగా పనిచేస్తున్న వారిని కూడా వైద్య శాఖ బదిలీ చేసింది. వాస్తవానికి సివిల్‌ సర్జన్లకు ప్రభుత్వమే నేరుగా పోస్టింగులు ఇస్తుంది. కానీ, తొలిసారి వారిని కూడా బదిలీ చేయడం విశేషం. ఈ జాబితాలో పదిమంది ఉండగా.. అందులో కొందరు డీఎంహెచ్‌వోలు, మరికొందరు ఆర్‌ఎంవోలు ఉన్నారు. ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో కృష్ణ వేరే జిల్లాకూ ఇన్‌చార్జిగా ఉండడంతో ఆయన్ను ఒరిజినల్‌ పోస్టులో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

ఏళ్ల తరబడి ఉన్నవారు మారలే..

హైదరాబాద్‌లో డీఎంహెచ్‌వోగా ఆరేళ్లుగా పనిచేస్తున్న వెంకట్‌ను బదిలీ చేయలేదు. తొలుత నిజామాబాద్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఆయన.. తర్వాత పదోన్నతి పొంది హైదరాబాద్‌లో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. ఇక నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న లాలు ప్రసాద్‌ 12 ఏళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. సంఘం నేత కావడంతో ఆయనకు స్థానచలనం కలగలేదు. అదే ఆస్పత్రిలో ఆర్‌ఎంవోగా ఉన్న దామోదరరావు 22 ఏళ్లుగా అక్కడే ఉన్నారు.

మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న శశికాంత్‌ 13 ఏళ్లుగా అక్కడే ఉన్నా.. బదిలీ చేయలేదు. పదిన్నరేళ్లుగా నాగర్‌కర్నూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న వెంకట్‌దాస్‌, ఖమ్మంలో ఆరేళ్లుగా పనిచేస్తున్న సైదులు కూడా అలాగే ఉన్నారు. వీరంతా అసోసియేషన్‌ లేఖలతో అక్కడే ఉండిపోయారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇక యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న సుప్రియను హైదరాబాద్‌లోని కుషాయిగూడకు బదిలీ చేశారు.

విచిత్రమేమిటంటే.. ఆమె ఉద్యోగంలో చేరి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. సాధారణ బదిలీలు ఆమెకు వర్తించవు. అయినా బదిలీ చేసేశారు. ఇలా అనేక విచిత్రాలు జరిగాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అసోసియేషన్‌ పేరుతో లేఖలు తెచ్చుకొని, అదే స్థానంలో కొనసాగుతున్న వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వైద్య సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 05:35 AM