Share News

Sridhar Babu: ఏడాదిలోనే అన్ని అవుతాయా?

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:43 AM

ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా రాష్ట్రం మారాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

Sridhar Babu: ఏడాదిలోనే అన్ని అవుతాయా?

  • హామీలను దశల వారీగా నెరవేరుస్తాం: శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా రాష్ట్రం మారాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. అధికారం కోల్పోయిన బాధలో వారు మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. ఎన్నికల హామీలను దశల వారీగా నెరవేరుస్తామని తెలిపారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక శివారులో పత్తిపాక రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. రైతులకు సాగునీటిని అందిస్తున్న ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్సేనని చెప్పారు.


పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.20 లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించడంతో పాటు మరో 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడానికి పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామన్నా రు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి పత్తిపాక రైతుల అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 02:43 AM