Share News

Khammam : కదిలిస్తే కన్నీటిగాథలే..

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:27 AM

ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇళ్లు..! ఖమ్మంలో మున్నేరు విలయంతో ఎటుచూసినా విషాద గాథలే..! ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే..!

Khammam : కదిలిస్తే కన్నీటిగాథలే..

ఖమ్మంలో మున్నేరు విలయంతో నిరుపేదల బతుకులు ఆగమాగం

ఎటుచూసినా మట్టికొట్టుకున్న వస్తువులు..

ఇళ్లు, వీధుల్లో బురద బాధలు.. అందని తాగునీరు, నిత్యవసరాల

ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇళ్లు..! ఖమ్మంలో మున్నేరు విలయంతో ఎటుచూసినా విషాద గాథలే..! ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే..! ఏ ఇంట్లో చూసినా మట్టికొట్టుకున్న వస్తువులు, దుస్తులే..! కొందరికి ఇవీ లేవు. ఆయా ప్రాంతాల్లో ఏ ఇల్లాలిని కదిలించినా కన్నీరే. మున్నేరు ఉగ్రరూపం దాల్చి 36 అడుగుల మేర ప్రవహించడంతో నది తీరాన ఉన్న ప్రాంతాల్లో వేల ఆవాసాలు నీట మునిగాయి. వాటిని ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించగా హృదయాలను కదిలించే దృశ్యాలు కనిపించాయి. కాగా, ముంపు తీవ్రత రీత్యా మరో రెండు రోజలు పునరావాస కేంద్రాలను కొనసాగించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. 13 మంది తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగులకు ఖమ్మంలో విధులు కేటాయించారు.


నీళ్లు లేవు.. నిత్యవసరాలు అందలేదు

వరద ఉధృతి తగ్గిన అనంతరం బాధితులు ఇళ్లకు చేరుకున్నా తాగేందుకే కాదు.. బురదను తొలగించేందుకు, వంట సామగ్రి శుభ్రానికీ నీళ్లు లేవు. ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు తెప్పించినా రోజులో ఒకసారే నీళ్లందుతున్నాయి. ప్రభుత్వ ట్యాంకర్లు సరిపోక ప్రైవేటు నీళ్ల ట్యాంకర్లను ఆశ్రయిస్తుంటే రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు మధ్యాహ్నం వరకు తమవైపు చూసే దిక్కే లేదని వాపోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న పులిహోర ప్యాకెట్లను పిల్లలకు పెట్టి తాము పస్తులుంటున్నామని కొందరు తెలిపారు. ఫైర్‌ ఇంజన్లతో రోడ్ల శుభ్రం ప్రధాన రహదారులకే పరిమితమైంది. బియ్యం, నూనె వంటి నిత్యవసరాలతో ప్రభుత్వం 30 వేల ప్యాకెట్లను సిద్ధం చేయించినప్పటికీ ఒకటి, రెండు ప్రాంతాలకే అందాయి. కొందరు తెలిసినవారి నుంచి ఆర్ధిక సాయం పొంది పూట గడుపుకోగా, ఇంకొందరు మూడు రోజులుగా ఒకటే దుస్తులతో ఉంటున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునురుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇళ్లను పరిశీలించాకే సరఫరా చేస్తున్నారు. భారీగా వస్తువులు బయటపడేస్తుండడంతో ఒక్కో వీధిలో పదుల ట్రాక్టర్లను ఉంచారు. ముంపు ప్రాంతాల్లో చాలా వాహనాలు కొట్టుకుపోగా.. వేల కొద్దీ నీట మునిగాయి. మున్నేరు దగ్గరలోని ఖమ్మం లారీ అసోసియేషన్‌లో 200 లారీలను వరద ముంచెత్తింది. మరమ్మతులకు రూ.50 వేల వరకు ఖర్చవుతోందని యజమానులు చెబుతున్నారు. ఒక్కోదాంట్లో 60 లీటర్ల డీజిల్‌ పనికిరాకుండా పోయిందన్నారు. వెయ్యికిపైగా కార్లు గ్యారేజీలకు చేరగా.. సగటున రూ.లక్ష, ఇంజన్‌లోకి నీళ్లు పోయిన ద్విచక్ర వాహనాలకు రూ.10 వేల వరకు ఖర్చవుతోందని మెకానిక్‌లు తెలిపారు.

- ఆంధ్రజ్యోతి, ఖమ్మం

Updated Date - Sep 04 , 2024 | 03:27 AM