మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంపం
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:46 AM
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భూకంపం సంభవించిన విషయాన్ని మరువక ముందే తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.
రిక్టర్ స్కేలుపై 3.0గా తీవ్రత
చిన్నచింతకుంట, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భూకంపం సంభవించిన విషయాన్ని మరువక ముందే తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మహబూబ్‌నగన్ జిల్లా కౌకుంట్ల మండలంలోని దాసర్‌పల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. భూప్రకంపనల ప్రభావంతో పలు ఇళ్లలో వస్తువులు కింద పడగా.. ప్రజలు ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు.
గ్రామంలోని 90 శాతం మంది రైతులు, వ్యవసాయ కూలీలు కాగా... పొలం పనుల్లో ఉన్నవారంతా భూకంపం దెబ్బతో భయపడి తామ వారి కోసం ఇళ్లకు పరుగు తీశారు. భూకంపం సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరిగాయని, మంచం మీద కూర్చున్న వారు కింద పడ్డారని స్థానికులు తెలిపారు. కాగా, భూకంపం భయంతో చాలా మంది ప్రజలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఇళ్లలోకి వెళ్లకుండా ఆరుబయటే ఉండిపోయారు.