Share News

ఫార్ములా-ఈ కారు కేసులో.. తొలుత బ్యాంకర్‌ విచారణ!

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:46 AM

ఫార్ములా-ఈ కారు రేస్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు.. ముందుగా విదేశీ సంస్థకు డబ్బు బదిలీ చేసిన బ్యాంకర్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఫార్ములా-ఈ కారు కేసులో.. తొలుత బ్యాంకర్‌ విచారణ!

  • అధికారులను కూడా విచారించిన తరువాతే కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

  • ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. దానకిషోర్‌

  • వాంగ్మూలం రికార్డు చేయనున్న అధికార్లు

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేస్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు.. ముందుగా విదేశీ సంస్థకు డబ్బు బదిలీ చేసిన బ్యాంకర్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లోని ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో)కు డబ్బు చెల్లించిన హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ)ను తొలుత ప్రశ్నించనున్నట్లు సమాచారం. నాటి పురపాలకశాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎఫ్‌ఈవోకు డబ్బు చెల్లించాల్సిందిగా.. హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి నుంచి ఐవోబీకి సమాచారం వెళ్లింది. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్‌ 3న రూ.22,69,63,125 మొత్తాన్ని పౌండ్ల రూపంలో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు అధికారులు చెల్లించారు. ఆ తర్వాత అక్టోబరు 11న రూ.23,01,97,500లను ఎఫ్‌ఈవో ఖాతాకు పౌండ్ల రూపంలో చెల్లించారు.


వాస్తవానికి దేశంలోని ఏ బ్యాంకు అయినా ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలకు సంబంధించి విదేశీ కంపెనీలకు ఆయా దేశాల కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించాలంటే భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ)కు సమాచారం ఇవ్వాలి. డబ్బు పంపిస్తున్న సంస్థలు ఆర్‌బీఐ అనుమతి తీసుకుని ఆ విషయాన్ని బ్యాంకర్‌కు తెలపాలి. కానీ, ఎఫ్‌ఈవో కేసు విషయంలో హెచ్‌ఏండీఏ.. ఆర్‌బీఐ అనుమతి తీసుకోలేదు. అలాంటప్పుడు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు అధికారులు మొత్తాన్ని హెచ్‌ఏండీఏ ఖాతాల నుంచి బ్రిటన్‌లోని ఎఫ్‌ఈవోకు ఎందుకు బదిలీ చేశారు? వారిపై ఏమైనా ఒత్తిళ్లున్నాయా? ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చారా? లేదా? అనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈడీ అధికారులు తదుపరి విచారణ చేపట్టవచ్చని సమాచారం. ముందుగా కేటీఆర్‌ను విచారించకుండా ఐఏఎస్‌ అధికారి అర్విందకుమార్‌, హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలను విచారించిన తర్వాతే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయవచ్చని తెలుస్తోంది.


ఫార్ములా ఈ కారు రేసు కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు తొలుత తమకు ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ కార్యదర్శి దానకి షోర్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం నాటి పురపాలకశాఖ కార్యదర్శి అర్విందకుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి నోటీసులిచ్చి వారిని విచారించడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు కొంత ప్రాథమిక విచారణ తర్వాతే నోటీసులు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. వచ్చేవారంలో కేటీఆర్‌కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Dec 22 , 2024 | 04:46 AM