నేడు, రేపు తేలికపాటి వర్షాలు..
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:10 AM
ఫెంగల్ తుఫాను ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శనివారం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి.
రాష్ట్రంలోనూ ‘ఫెంగల్’ ప్రభావం
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
ఆదివారం పలుచోట్ల చిరుజల్లులు
హైదరాబాద్ సిటీ, ఖమ్మం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఫెంగల్ తుఫాను ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శనివారం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని పద్ర మండలంలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, కొణిజర్ల సహ పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఓ వైపు కోతలు, మరో వైపు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో రైతులు హడలిపోతున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం దాకా రాజధాని వాసులను వణికించిన చలి రెండ్రోజులుగా తగ్గింది. హైదరాబాద్‌లో ఆదివారం గరిష్ఠంగా 28.7, కనిష్ఠంగా 21.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.