Lok Sabha: ఎంపీలుగా తెలంగాణ నేతలు ప్రమాణస్వీకారం.. ఒవైసీ వివాదాస్పద నినాదాలు
ABN , Publish Date - Jun 25 , 2024 | 04:38 PM
తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో నేడు (మంగళవారం) ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.
ఢిల్లీ: తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో (Lok Sabha) నేడు (మంగళవారం) ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) సభ్యులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కూడా ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురాం రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఇక సురేశ్ షెట్కర్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ఇక హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉర్డూలో ప్రమాణం చేశారు.
కాగా ప్రమాణస్వీకారం సందర్భంగా తెలంగాణ ఎంపీలు కొందరు ఆసక్తికరమైన నినాదాలు చేశారు. ఎవరెవరు ఏం నినాదాలు చేశారంటే..
1. జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేసిన ఈటల రాజేంధర్
2. జై లక్ష్మీ నర్సింహ స్వామి అని నినదించిన కిరణ్‌కుమార్ రెడ్డి
3. జై భద్రకాళి అని నినాదం చేసిన కడియం కావ్య
4. జై తుల్జా భవాని అన్న బలరాం నాయక్
5. జై భీం అని నినదించిన ఎంపీలు మల్లురవి, కావ్య, రఘురాంరెడ్డి
వివాదాస్పదంగా మారిన అసదుద్దీన్ నినాదాలు
ప్రమాణస్వీకారం పూర్తయిన సందర్భంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన నినాదాలు చర్చనీయాంశంగా మారాయి. ‘ జై పాలస్తీనా, అల్లాహో అక్బర్’ అంటూ అసదుద్దీన్ తన ప్రమాణం పూర్తి చేయడం ఇందుకు కారణమైంది. జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నిబంధనలు పరిశీలించి... రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభాపతి స్థానంలో రాధామోహన్ సింగ్ సభ్యులకు సర్దిచెప్పారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని ఆయన తెలిపారు.