TG: గుండెపోటుతో ఉద్యోగి, ఐదుగురు ఓటర్ల మృతి
ABN , Publish Date - May 14 , 2024 | 04:30 AM
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండెపోటుతో ఓ ఎన్నికల ఉద్యోగి, ఐదుగురు ఓటర్లు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూనగర్ పోలింగ్ బూత్‌లో ఏపీవోగా విఽధులు నిర్వరిస్తున్న శ్రీకృష్ణ (55) గుండెపోటుతో కుప్పకూలాడు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండెపోటుతో ఓ ఎన్నికల ఉద్యోగి, ఐదుగురు ఓటర్లు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూనగర్ పోలింగ్ బూత్‌లో ఏపీవోగా విఽధులు నిర్వరిస్తున్న శ్రీకృష్ణ (55) గుండెపోటుతో కుప్పకూలాడు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. శ్రీకృష్ణ కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అలాగే అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన కాశీ నాగేశ్వరరావు (54) వాగొడ్డుగూడెం పోలింగ్ బూత్‌లో ఓటేసి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా తాటిపూడిలో ఓటేసేందుకు పోలింగ్ స్లిప్‌తో బయలుదేరిన కొల్లిపాక వీరస్వామి (68) గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ఇప్పకాయల సరోజన (80) సహాయకుల ద్వారా పోలింగ్ కేంద్రంలో ఓటేసి వస్తుండగా గుండెపోటు రావడంతో మరణించింది. హైదరాబాద్ ఉప్పల్ ఓల్డ్ భరత్‌నగర్‌కు చెందిన గట్టు విజయలక్ష్మి (65) ఓటేసి బయటకు వస్తూనే గుండెపోటుతో మరణించింది. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన శ్రీగంధం గిర్మవ్వ (83) పోలింగ్ కేంద్రం ఆవరణలోనే స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించింది.