Warangal: ఎంజీఎంలో నిలిచిన 2డీ ఎకో పరీక్షలు..
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:40 AM
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలోని 2డీ ఎకో పరీక్షలు నిలిచిపోవడంతో హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రి అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ పలువురు వాగ్వాదానికి దిగడంతో ఆస్పత్రిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తీవ్ర ఇబ్బందులు పడ్డ హృద్రోగులు
వరంగల్ మెడికల్, జూలై 10: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలోని 2డీ ఎకో పరీక్షలు నిలిచిపోవడంతో హృద్రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రి అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ పలువురు వాగ్వాదానికి దిగడంతో ఆస్పత్రిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఎంజీఎంకు రోజు 100 నుంచి 150 మంది హృద్రోగులు గుండె పరీక్షలు చేయించుకునేందుకు వస్తుంటారు. బుధవారం కూడా రోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ కార్డియాలజీ డాక్టర్లే లేరు. దీంతో టూడీ ఎకో పరీక్షలు చేసేవారే లేకుండా పోయారు. రోగులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరీక్షల కోసం వార్డులో పడిగాపులు కాశారు.
డాక్టర్ల జాడ లేకపోవడంతో ఆస్పత్రి అధికారులు 2డీ ఎకో పరీక్షలకు కోసం రోగులను కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి పంపించారు. అప్పటికే అక్కడ కార్డియాలజీ విభాగంలో 2డీ పరీక్షల కోసం రోగులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. ఎంజీఎం నుంచి కూడా రోగులు రావడంతో వార్డులో రద్దీ పెరిగింది. సూపర్‌స్పెషాలిటీలోని డాక్టర్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ.. రోగులకు పరీక్షలు చేయడానికి నిరాకరించారు. దీంతో అక్కడా డాక్టర్లకు, రోగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరికి చేసేది లేక రోగులు టూడీ ఎకో పరీక్షలు చేయించుకోకుండానే నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.