Share News

Hospital Security: ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపు

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:47 AM

కోల్‌కతాలో ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

Hospital Security: ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపు

  • విజువల్‌ పోలీసింగ్‌కు పటిష్ఠ చర్యలు

  • కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కోల్‌కతాలో ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల వద్ద భద్రత పెంపుపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వైద్యుల భద్రతకు భరోసా కల్పించే విధంగా విజువల్‌ పోలీసింగ్‌కు చర్యలు చేపట్టారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రులతోపాటు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో రోగులు, సహాయకులు వస్తుంటారు. జూనియర్‌ డాక్టర్లపై ఎలాంటి దాడులకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లు చేయాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ కార్యాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న ఆస్పత్రులు, కాలేజీల వద్ద తప్పని సరిగా గస్తీలో ఉండే పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట ప్రత్యేకంగా పికెటింగ్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఏజెన్సీలతో అధికారులు సమావేశమై భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆస్పత్రుల్లో అమర్చిన సీసీ కెమెరాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది లేనిది సరిచూసుకోవాలన్నారు.


అవసరాన్నిబట్టి ఎక్కడైనా కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి వస్తే సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, త్వరలో జరిగే గణేష్‌ ఉత్సవాల భద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా శాంతిభద్రతల పరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో అందుకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటి నుంచే చేపట్టాలని కమిషనర్లు, ఎస్పీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీలతో స్టేషన్‌ హౌస్‌ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు.

Updated Date - Aug 26 , 2024 | 03:47 AM