Share News

KIMS Hospital: శ్రీ తేజ కళ్లు తెరుస్తున్నాడు.. మూస్తున్నాడు

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:27 AM

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు శ్రీ తేజ కళ్లు తెరుస్తున్నాడు.. మూస్తున్నాడు కానీ తనను గుర్తు పట్టే స్థితిలో లేడని తండ్రి భాస్కర్‌ తెలిపారు.

KIMS Hospital: శ్రీ తేజ కళ్లు తెరుస్తున్నాడు.. మూస్తున్నాడు

  • కానీ నన్ను గుర్తుపట్టే స్థితిలో లేడు

  • నా కూతురు అమ్మ ఎక్కడా అని అడిగితే... ఊరెళ్లిందని చెబుతున్నా

  • సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు

  • అల్లు అర్జున్‌ టీం 10 లక్షలు చెల్లించింది

  • నెల ముందు నుంచే సినిమా చూడాలని ప్లాన్‌

  • అర్జున్‌పై కేసు వాపసు తీసుకునేందుకు సిద్ధం: శ్రీ తేజ తండ్రి భాస్కర్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు శ్రీ తేజ కళ్లు తెరుస్తున్నాడు.. మూస్తున్నాడు కానీ తనను గుర్తు పట్టే స్థితిలో లేడని తండ్రి భాస్కర్‌ తెలిపారు. ఆసుపత్రిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీ తేజ కోలుకునేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. తన కూతురు అమ్మ ఎక్కడా అని అడిగితే ఊరెళ్లిందని చెబుతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం తమకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా రూ.25 లక్షల చెక్కు అందచేశారని తెలిపారు.


అల్లు అర్జున్‌ టీం రూ.10 లక్షల డీడీ ఇచ్చిందని, మరో రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు నుంచి ఆ బృందం సభ్యులు వైద్యులతో ప్రతిరోజూ మాట్లాడున్నారని చెప్పారు. తాను మొదటి రోజు ఆసుపత్రిలో రూ. 50 వేలు చెల్లించానని, ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్‌ బృందం సభ్యులే అన్నీ చూసుకుంటున్నారని తెలిపారు. శ్రీ తేజకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టమని, నెలరోజుల ముందు నుంచే ప్రీమియర్‌ షో చూసేందుకు కుటుంబమంతా ప్లాన్‌ చేసుకున్నామని వెల్లడించారు. మూడు రోజుల ముందు స్నేహితుల సహకారంతో సినిమా టికెట్లు తీసుకొని సినిమా చూసేందుకు వెళ్లినట్లు తెలిపారు. అనుకోకుండా థియేటర్‌లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా తమ కుటుంబం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌పై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శ్రీతేజ తండ్రి భాస్కర్‌ తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 03:27 AM