Liver Health: ఫ్యాటీ లివర్.. నేటి కిల్లర్
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:44 AM
మన శరీరంలో ఏ కీలక అవయవమైనా కాస్త పని చేయకపోతే ఆ లక్షణాలు బయటపడతాయి! అన్ని అవయవాలు పనిచేసేలా పెద్దన్న పాత్ర పోషించే ఒక్క కాలేయం తప్ప! తనలో కొవ్వు చేరితే ఆ అనారోగ్య లక్షణాలను బయటపెట్టదని..
పీఎన్‌పీఎల్‌ఏ 3 జన్యువుతో భారీగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ కేసులు
దేశంలో 30-40 కోట్ల మంది బాధితులు మద్యం, శారీరక శ్రమ లేమీ కారణాలే..
రాబోయే 2-3 ఏళ్లలో ఇదే ప్రధాన జబ్బు
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మన శరీరంలో ఏ కీలక అవయవమైనా కాస్త పని చేయకపోతే ఆ లక్షణాలు బయటపడతాయి! అన్ని అవయవాలు పనిచేసేలా పెద్దన్న పాత్ర పోషించే ఒక్క కాలేయం తప్ప! తనలో కొవ్వు చేరితే ఆ అనారోగ్య లక్షణాలను బయటపెట్టదని.. ఆ కొవ్వు పెరుగుతూ పోతున్నా కాలేయం పెద్దగా హెచ్చరించదనే విషయం ఎంతమందికి తెలుసు? చివరికి ఆ కొవ్వు దశలవారీగా పెరుగుతూపోయాక అదే కాలేయం ‘పని చేయడం ఇక నావల్ల కాదు’ అని చేతులెతేస్తుంది! అంటే.. లివర్ పూర్తిగా చెడిపోయాక గానీ ఆ తాలూకు లక్షణాలు బయటపడవు. ఇప్పుడీ ముప్పు ప్రతి 100 మందిలో 30-40 మందికి పొంచి ఉందనేది జీర్ణించుకోలేని వాస్తవం! మితిమీరిన మద్యం అలవాటు ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుందని చాలామందికి తెలుసు! అయితే.. ఆహారపు అలవాట్లలో తేడాలు, జీవనశైలిలో మార్పులు, శారీరక వ్యాయామం లేకపోవడమూ ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. ఇది మరింత ప్రమాదకరం! అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ ఏదైతేనేమీ శరీరంలోని ప్రధాన అవయవాలను పనిచేయించే కాలేయానికి కొవ్వు పడుతోంది. అది స్టేజ్ 1, 2, 3, 4గా పెరిగిపోయి చివరికి లీవర్ సిరోసి్‌సకు దారితీస్తోంది.
నాన్ అల్కాహాలిక్ ప్యాటీ లివర్ ప్రధానంగా ఊబకాయులు, మధుమేహంతో బాధపడుతున్నవారు, రక్తంలో అధిక కొవ్వు ఉన్నవారికి వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తరచుగా మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం కలిగి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో 80 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని అంటున్నారు. రానున్న రెండు మూడేళ్లల్లో ఇతర జబ్బుల కంటే ఫ్యాటీ లివర్ ప్రధాన అనారోగ్య సమస్యగా మారబోతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మనదేశంలోనే 30-40 కోట్ల మంది ఫ్యాటీ లివర్ బాధితులున్నారు. అయితే ఈ సమస్య ఇంతలా పెరగడానికి ప్రధానంగా పీఎన్‌పీఎల్‌ఏ 3 అనే జన్యువు కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ కిల్లర్‌గా మారి, (అసంక్రమిత వ్యాధులు) ఎన్‌సీడీ వ్యాధులను మించిపోతుందని అంటున్నారు.
కాగా, పీఎన్‌పీఎల్‌ఏ 3 జన్యువు అనేది మన శరీరంలో అడిపోన్యూట్రిన్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులో, కాలేయ కణాల్లో ఉంటుంది. కొవ్వు ఉత్పత్తి, విచ్చిన్నతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే మనం ఏం తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు దీని ఉత్పత్తి తగ్గుతుందని.. తిన్న తర్వాత పెరుగుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఆహారంలోని కొవ్వులను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడంలో సాయపడటానికి, నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ జన్యువుకు హెపాటోసెల్లర్ కార్సినోమా, స్టీటోసిస్, ఫైబ్రోసిస్ వంటి కాలేయ వ్యాధులతో సంబంధం ఉంటుంది. ఈ జన్యువు పనితీరును కోల్పోతే హైపటోసైట్(కాలేయ కణాల)లో ట్రైగ్లిజరైడ్ చేరడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది.
మద్యం సంబంధిత లివర్ డ్యామేజ్ కేసులు పెరుగుతున్నాయి
మన దగ్గర గడిచిన పదేళ్లలో ఆల్కహాల్ సంబంఽధిత కాలేయ సమస్యల కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఆస్పత్రుల్లో 50 శాతం కాలేయ సమస్యలు కేవలం ఆల్కహాల్ సంబంధించినవే ఉంటున్నాయి. దీంతో లివర్‌సిరోసిస్ పెరుగుతోంది. చాలామంది ఫ్యాటీ లీవర్‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పట్టించుకోవడం లేదు. తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఊబకాయం, మధుమేహం సమస్యలున్నవారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లీవర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు దేశం రాజథానిగా మారిపోయింది. దీనిపై ఇటీవలే నేషనల్ హెల్త్ టాస్క్‌ఫోర్స్‌కు కూడా లేఖ రాశాం. అందులో ఫ్యాటీలివర్ ఒక అంటువ్యాఽధిలా మారిందని, దానిపై తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని కోరాం. ప్రస్తుతం జీవనశైలి వల్ల కూడా త్వరగా లీవర్ డ్యామేజ్ అవుతోంది.
- డాక్టర్ నాగేశ్వర రెడ్డి,
చైర్మన్ ఏఐజీ ఆస్పత్రి, హైదరాబాద్
ఫ్యాటీ లివర్ కేసుల తీవ్రత పెరుగుతోంది
రాబోయే రెండు మూడేళ్లలో ఫ్యాటీలివర్ అనేది ప్రధాన అనారోగ్య సమస్యగా మారబోతోంది. ఇతర వ్యాధుల కంటే దీని తీవ్రత పెరగబోతోంది. రక్త పరీక్షలతో పాటు అలా్ట్ర సౌండ్ స్కానింగ్‌లో ఇది బయటపడుతుంది. ఉదర భాగంలో కుడివైపు నొప్పి కలిగితే లీవర్ సమస్య ఉన్నట్లు భావించాలి. దీన్ని నివారించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి.గుండె జబ్బులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాంటి కేర్‌నే దీని విషయంలోనూ పాటించాలి. శరీర బరువు ఐదు నుంచి పది శాతం వరకు తగ్గాలి. ప్రోటీన్లు, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి విదేశాల్లో మద్యం మానేసి, లీవర్ జబ్బుల బారినపడకుండా ఉంటే...మనదగ్గర మాత్రం దానివల్ల ఎక్కువ మంది కాలేయ సంబంధిత సమస్యలతో వస్తున్నారు.
- డాక్టర్ బూరుగుమళ్ల సుకన్య,
హెచ్‌వోడీ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నిమ్స్ ఆస్పత్రి.