Travel Rush: పట్నం వదిలి.. పల్లె బాట
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:46 AM
బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది.
బస్, రైల్వే స్టేషన్లలో పండగ రద్దీ.. రహదారులపై వాహనాల బారులు
ప్రయాణికుల రాకపోకల్లో ఎయిర్‌పోర్టు రికార్డు
ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు
హైదరాబాద్ సిటీ(ఆంధ్రజ్యోతి)/(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)/చౌటుప్పల్ టౌన్, అక్టోబరు 5: బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లు.. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ ప్రాంతాల నుంచి శనివారం రాత్రి 9 గంటల వరకు 900కు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లాలకు వెళ్లిన స్పెషల్ సర్వీసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుందని వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. శనివారం కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో రహదారిపై రద్దీ పెరిగింది. ఎల్‌బీనగర్ నుంచి చౌటుప్పల్ పట్టణం వరకు 36 కి.మీ. వచ్చేందుకు దాదాపు రెండు గంటలు పట్టిందని వాహనదారులు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో కొత్త రికార్డు సృష్టించింది. వారం రోజులుగా సగటున రోజుకు 80వేల మందికిపైగా ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారు. అత్యధికంగా గత నెల 29న 87,031 మంది రాకపోకలు సాగించారు.
విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికమని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు, దసరా పండగ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. శనివారం పోర్ట్‌బ్లెయిర్‌కు నేరుగా వెళ్లిన సర్వీసు టికెట్ ధర అత్యధికంగా రూ.40వేల వరకు పలికింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాత్రి 10.35 గంటలకు బయలుదేరే ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర రూ.28,810 వరకు ఉంది.