Share News

Chiranjeevi: మీ రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతున్నారు

ABN , Publish Date - Oct 04 , 2024 | 02:55 AM

మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ గౌరవానికి, సమంత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ’ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మంత్రిని ప్రశ్నించారు.

Chiranjeevi: మీ రాజకీయాల్లోకి మమ్మల్నెందుకు లాగుతున్నారు

  • మంత్రి వ్యాఖ్యలు అవమానకరం: చిరంజీవి

  • సురేఖ వ్యాఖ్యలను ఖండించిన సినీ ప్రముఖులు

మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ గౌరవానికి, సమంత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ’ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా మంత్రిని ప్రశ్నించారు. ‘‘మంత్రి వ్యాఖ్యలు నన్ను చాలా బాఽధించాయి. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి. రాజకీయ మనుగడ కోసం అభ్యంతరకర రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదు. రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచానికి దిగజారకూడదు. రాజకీయాలతో సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం సరికాదు. మా చిత్ర పరిశ్రమ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు దాడులను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం.


మంచి చేస్తారని మేం నాయకులను ఎన్నుకుంటున్నాం. కానీ మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు అందరికీ స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. మంత్రి ఆరోపణలతో తాను దిగ్ర్భాంతికి గురైనట్టు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. ‘‘బీజేపీ నేత రఘునందన్‌ విషయంలో ఎవరో తనను అవమానిస్తే.. అసలు ఆ విషయంతో ఏ సంబంధమూ లేని నాగార్జునను, నాగచైతన్యను దారుణంగా అవమానించడమేమిటి? వాళ్లిద్దరినీ అంత జుగుప్సాకరంగా అవమానించి ఇప్పుడు సమంతకు క్షమాపణ చెప్పడమేంటి? ఇందులో సమంతను అవమానించడం ఏముంది? ఇంతకన్నా ఘోరమైన అవమానాన్ని నా జీవితంలో చూడలేదు.


సురేఖ తానేదో కళ్లతో చూసినట్లు, చెవులతో విన్నట్లు మీడియా ముందు అరచి చెప్పడం దారుణం’’ అని ఆర్జీవీ మండిపడ్డారు. ఉన్నతస్థానాల్లో ఉన్నవారు సంయమనంతో ఉండాలని.. వ్యక్తిగత విషయాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దురదృష్టకరమని నటుడు వెంకటేశ్‌ అన్నారు. మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, తెలుగు సంస్కృతికి విరుద్ధంగా ఉందని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. ఇలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తనను ఉపేక్షించకూడదని ఆయన పేర్కొన్నారు. మహిళా మంత్రి అయి ఉండి.. సాటి మహిళపై సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని మహేశ్‌బాబు అన్నారు. ‘‘మీ భాష పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యాను. మీ చౌకబారు, నిరాధార వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. ఇక.. ఇలాంటి ప్రవర్తనను చిత్ర పరిశ్రమ, సమాజం సహించదని.. ఇలాంటివాటిని తాము చూస్తూ ఊరుకోబోమని నటుడు ఎన్టీఆర్‌ హెచ్చరించారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైనది కాదని ఆయన హితవు పలికారు. చిత్ర పరిశ్రమను బాధపెట్టాలని ఎవరు చూసినా తాను మౌనంగా ఉండబోనని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడాన్ని పరిశ్రమ సహించదని దర్శకుడు రాజమౌళి పేర్కొనగా.. మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంభించడం భయాందోళనలకు గురిచేస్తోందని నటుడు రవితేజ అన్నారు.


‘‘బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, మీడియా ముందు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చు అని రాజకీయ నాయకులు అనుకోవడం అసహ్యకరంగా ఉంది’’ అని నటుడు నాని ట్వీట్‌ చేయగా.. స్వార్థం కోసం ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చవద్దని విజయ్‌ దేవరకొండ అన్నారు. ఇక.. మంత్రి సురేఖ తన పేరును ప్రస్తావించడంపై నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించారు. ‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరు వాడుకోవద్దు’అని విజ్ఞప్తి చేశారు. ‘మన ప్రవర్తన హుందాగా ఉండాలని మౌనాన్ని ఆశ్రయిస్తాం. కానీ దాన్ని మన బలహీనతగా భావిస్తారు’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కాగా.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.


అందరి దృష్టినీ ఆకర్షించడానికి సినిమావాళ్లపై చేసిన ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని.. తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అందులో హెచ్చరించింది. సినీ ప్రముఖుల ఆగ్రహం నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పందించారు. ‘‘మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకండి’’ అని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులకు, మంత్రులకు ఆయన సూచించారు.

Updated Date - Oct 04 , 2024 | 02:55 AM