Share News

Nizamabad: ‘మిత్తి’మీరిన ఆగడం

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:27 AM

అవసరాన్ని బట్టి రూ.10 వడ్డీ.. అది కూడా తక్కువ గడువే.. ఆలోగా అసలుతో కలిపి చెల్లించారా సరేసరి..! లేదంటే.. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా వేధింపులు తిప్పలు తప్పవు..!

Nizamabad: ‘మిత్తి’మీరిన ఆగడం

ఉమ్మడి నిజామాబాద్‌లో అడ్డే లేని వడ్డీ వ్యాపారుల దందా.. రాబట్టుకునేందుకు కిరాయి మనుషులు.. వారితో బెదిరింపులు

  • వందకు రూ. 3 నుంచి రూ.10 దాకా

  • ప్రత్యేక కార్యాలయాలతో రోజుకో కొత్త ఫైనాన్స్‌ సంస్థ పుట్టుక

  • వీరిలో ఉద్యోగులు, పోలీసులు, కొందరు రాజకీయ నేతలూ!

  • సామాన్యుల వద్ద ముక్కుపిండి వసూలు

  • వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నాలు

  • దందాపై చర్యలు తప్పవ్‌.. నిజామాబాద్‌ ఏసీపీ రాజవెంకట్‌రెడ్డి

నిజామాబాద్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అవసరాన్ని బట్టి రూ.10 వడ్డీ.. అది కూడా తక్కువ గడువే.. ఆలోగా అసలుతో కలిపి చెల్లించారా సరేసరి..! లేదంటే.. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా వేధింపులు తిప్పలు తప్పవు..! కిరాయి మనుషులతో బెదిరింపులు ఆగవు..! ఇదీ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఫైనాన్స్‌లు, వడ్డీ వ్యాపారుల ఆగడం. దీనిని తట్టుకోలేక కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు. వీరు అప్పు ఇచ్చే సమయంలో పూర్తి నిబంధనలు చెప్పరు. ఖాళీ చెక్కులను తీసుకుంటారు. ఈ క్రమంలో మధ్య తరగతి, సామాన్యులతో పాటు చిరుద్యోగులు వడ్డీ వ్యాపారుల వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. అధిక వడ్డీల దెబ్బతో కొందరైతే ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఇలాంటి దారుణాలు పెచ్చుమీరుతున్నా కేసులు మాత్రం నామమాత్రంగానే నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల వడ్డీ వ్యాపారులకు పోలీసులు కూడా సహకరిస్తుండడంతో ఆస్తులను జప్తు చేసుకుంటున్నారు. దీనిని చూసి రోజుకో సంస్థ పుట్టుకొస్తోంది. ఏ గుర్తింపు లేకుండానే రూ.లక్షలు చెలామణీ చేస్తున్నాయి.


ఇలాంటివాటిలో కొన్ని.. రుణం తీసుకున్న సమయంలోనే వడ్డీ పట్టేసుకుంటున్నాయి. కాగా, చిరు వ్యాపారులకు నిత్యం అవసరాలు ఉండడంతో వడ్డీకి తీసుకోక తప్పడం లేదు. ఇళ్లు, భూములు, బంగారం తనఖా పెట్టుకున్నా వడ్డీ మాత్రం తగ్గించడం లేదు. నిర్ణీత సమయంలో వడ్డీతో పాటు అసలు కట్టనివారికి చక్రవడ్డీ వేసి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఇచ్చిన అప్పు కన్నా ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ చక్ర వడ్డీ కలిపి గుంజుతున్నారు. వేధింపులపై పోలీసుల వద్దకు వెళ్లినా సివిల్‌ వ్యవహారంగా చెప్పి కేసు నమోదు చేయడం లేదు. మరికొందరికి పోలీసులే మధ్యవర్తిగా ఉండి సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లో బంగారం విలువలో 60-70 శాతం వరకు అప్పుగా ఇస్తున్నారు. వారు పెట్టిన నిబంధనల ప్రకారం చెల్లించకుంటే జప్తు చేస్తున్నారు. నిజామాబాద్‌, బోధన్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌లలో చిన్న గదులు తీసుకుని కొందరు కార్యాలయాలు తెరవగా, మరికొందరు ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. కొందరు వ్యాపారులు ప్రధాన పార్టీల్లో చేరి నాయకుల మద్దతుతో దందా నడిపిస్తున్నారు. కాగా, నిర్ణీత సమయంలో చెల్లించినా తనఖా ఆస్తులను తిరిగివ్వడం లేదు. లేదా చెప్పినదాని కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారు.


  • గల్ఫ్‌ వెళ్లేవారికీ..

ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన చోట ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే వడ్డీ వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. మరికొన్నిచోట్ల వారే వడ్డీ వ్యాపారుల వెనుక ఉన్నారు. కాగా, గతంలో గ్రామాల్లో రూపాయిన్నర నుంచి రూ.2 వరకు వడ్డీకి ఇచ్చేవారు. ఇప్పుడు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. గల్ఫ్‌ వెళ్లేవారు కూడా వీరినే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ అక్కడ ఉపాధి దొరకకపోతే అప్పులకు వడ్డీలు చెల్లించలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వడ్డీ వ్యాపారం చేసేవారిలో ఎక్కువమంది వ్యాపారులు, ఉద్యోగులు, పోలీసులు, కొందరు నాయకులు ఉన్నారు.ముఖ్యంగా ఉద్యోగులు వెనుక ఉండి నడిపిస్తున్నారు. పలు రంగాలకు చెందినవారు ఉండడంతో కేసులు నమోదు కావడం లేదు. ముగ్గురు నలుగురు కలిసి ఫైనాన్సుల పేరు మీద ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండానే దందా సాగిస్తున్నారు. గొడవలు వచ్చిన సమయంలో కేసులు కాకుండా చూసుకుంటున్నారు. వడ్దీ దందా డబ్బును భూముల కొనుగోళ్లు, ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నారు.


  • ఇవిగో దారుణాలు

  • నిజామాబాద్‌కు చెందిన చిరు వ్యాపారి రుణ దాతల వేధింపులను తట్టుకోలేక ఇటీవల బాసర వద్ద గోదావరిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యాల్‌కల్‌కు చెందిన వ్యాపారి వేణు, భార్య అనురాధ, కూతురు పూర్ణిమతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. తండ్రీకూతురు మృతిచెందగా అనురాఽధ ప్రాణాలతో బయటపడింది. అసలు చెల్లించినా.. అధిక వడ్డీ వేసి వేధింపులకు పాల్పడడంతో బలవన్మరణానికి యత్నించామని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • రెండు నెలల క్రితం ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తండ్రీ, తల్లీ, కొడుకు వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం నిజామాబాద్‌ వ్యాపారి ఆస్తులను జప్తు చేయడంతో ఏపీలోని విజయవాడ వెళ్లి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు ఇప్పటికీ ఉంది.

  • కొందరు ఊళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆస్తులను తీసుకోవడంతో పాటు వేధింపులు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అవమానంగా భావించిన పలువురు మరోచోట అధిక వడ్డీలకు తెచ్చి చెల్లించిన ఉదంతాలున్నాయి.

  • వేధింపులకు పాల్పడితే చర్యలు

అధిక వడ్డీ వసూలు, వేధింపులకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేయకుండా పోలీసులను ఆశ్రయించాలి. గతంలో కొందరు ప్రైవేటు ఫైనాన్స్‌ నిర్వాహకులపై కేసులు పెట్టాం.

- నిజామాబాద్‌ ఏసీపీ ఎల్‌.రాజవెంకట్‌రెడ్డి

Updated Date - Nov 16 , 2024 | 04:27 AM