Gummadi Narsaiah: నేటి రాజకీయాల్లో అంతరిస్తున్న నైతిక విలువలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:16 AM
నేటి రాజకీయాల్లో నైతిక విలువలు అంతరించిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని, గతంలో ఈ పద్ధతి ఉండేది కాదని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
బర్కత్‌పుర, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నేటి రాజకీయాల్లో నైతిక విలువలు అంతరించిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని, గతంలో ఈ పద్ధతి ఉండేది కాదని పేర్కొన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బై ది పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 26న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నిర్వహించనున్న పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను ఉమ్మడి ఏపీ లోకాయుక్త విశ్రాంత జడ్జి వి.లక్ష్మణరెడ్డి తదితరులతో కలిసి గుమ్మడి నర్సయ్య ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయ నాయకులు ఒక పార్టీలో గెలిచి పదవుల కోసం మరో పార్టీలో చేరుతున్నారని దుయ్యబట్టారు.
గతంలో కేసీఆర్ ఫిరాయింపులను ప్రొత్సహించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన విమర్శించారు. జస్టిస్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విశ్రాంత చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సమాజంలో అరాచకత్వం బాగా పెరిగిపోయిందని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్, పార్టీ మారే ముందు పదవికి రాజీనామా తదితర డిమాండ్లతో వచ్చే జనవరి 26న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బై ది పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు, పాదయాత్ర నిర్వాహకుడు వి.గణేశ్ తెలిపారు.