Nalgonda: కస్టమ్స్ పేరుతో 7.19 కోట్ల దోపిడీ
ABN , Publish Date - Oct 10 , 2024 | 04:47 AM
ఓ వ్యాపారి నుంచి రూ. 7.19 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి తన వ్యాపార భాగస్వామి ద్వారా బెంగళూరుకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
నల్లగొండ వ్యాపారిని మోసగించిన కేటుగాడి అరెస్టు
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యాపారి నుంచి రూ. 7.19 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి తన వ్యాపార భాగస్వామి ద్వారా బెంగళూరుకు చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కార్పొరేట్ ఈవెంట్ మేనెజ్‌మెంట్ నిర్వహించే సునీల్.. తనకు తెలిసిన వారికి విదేశాల నుంచి విరాళాల రూపంలో పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని దాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, పన్ను చెల్లింపునకు డబ్బులు ఇస్తే వచ్చిన నగదులో 30 శాతం వాటా ఇస్తానని నమ్మబలికాడు.
అలాగే తనను కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ నేషల్ జ్యూట్ బోర్డు చైర్మన్‌గా నియమించిందని, తన పరపతితో ఆ నగదు విడిపిస్తానని చెప్పాడు. దాంతో సునీల్ కుమార్ మాటలు నమ్మి 10 నెలల్లో 80 బ్యాంకు ఖాతాలకు బాధితుడు రూ. 7.19 కోట్లు బదలాయించాడు. తనకు ఇస్తానన్న 30 శాతం వాటా గురించి ప్రస్తావించకపోవడం, తీసుకున్న నగదును తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సీఎ్‌సబీ పోలీసులు నిందితుడు సునీల్ కుమార్‌ను బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.