Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:31 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు చెన్నైలో అప్పగించారు.
గుట్ట ఆలయ ఈవో భాస్కర్‌రావు
భువనగిరి అర్బన్, అక్టోబరు 10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు చెన్నైలో అప్పగించారు. అలాగే, రాగి రేకులు, రాగి విగ్రహాలను భారీ కంటైనర్‌లో చెన్నైకు తరలించారు. రాజగోపురానికి బంగారు తాపడం కోసం ఇప్పటికే దేవస్థానం 60 కిలోల బంగారాన్ని సేకరించగా, అందులో 11.700 కిలోలను చెన్నై సంస్థకు అందజేశారు.
మిగతా బంగారాన్ని విడతల వారీగా అప్పగించనున్నారు. కాగా, బంగారాన్ని చెన్నై సంస్థకు ఇచ్చామని, రాగి రేకులు, విగ్రహాలకు బంగారం తాపడం చేసే పనులను దసరా రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ పనులు పూర్తయిన అనంతరం 2025 ఫిబ్రవరి 15న విగ్రహాలు, రాజగోపురానికి తాపడం రేకుల బిగింపు పనులు ప్రారంభించి 25వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గతంలో ధ్వజస్తంభం, ముఖ ద్వారానికి రాగి తాపడం పనులు చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు ఈ పనులు అప్పగించడం గమనార్హం.