Indiramma Housing: తక్కువ ధరకే ఇసుక, ఉక్కు, సిమెంటు
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:49 AM
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త..! ముందుగానే ప్రకటించిన నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు.. లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా ఇసుక, ఉక్కు, సిమెంటును తక్కువ ధరకే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు.. ప్రభుత్వ నిర్ణయం!
ఉక్కు, సిమెంట్ ధరలపై కంపెనీలతో చర్చించనున్న రాష్ట్ర సర్కారు
ప్రభుత్వ పరిధిలోనే ఇసుక లభ్యత.. 500 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం
ఇప్పటి వరకు 80.5 లక్షల దరఖాస్తులు.. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త..! ముందుగానే ప్రకటించిన నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు.. లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా ఇసుక, ఉక్కు, సిమెంటును తక్కువ ధరకే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లో చుక్కలనంటుతున్న నేపథ్యంలో.. పేదలపై పెద్దగా ఆర్థిక భారం పడకుండా చూడాలని భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ అందజేసిన ఓ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గృహ నిర్మాణ సంస్థ ఇచ్చిన నివేదికలో.. వ్యక్తిగతంగా ఒక్కో ఇంటికి ఎంత సిమెంట్, ఇసుక, ఉక్కు అవసరం? రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 4.5 లక్షల ఇళ్లకు ఎంత అవసరం? అనే వివరాలను వెల్లడించింది.
400 చదరపు అడుగుల్లో నిర్మించే ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక, 180-190 బస్తాల(9 మెట్రిక్ టన్నులు) సిమెంటు, 1.5 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరం అని అధికారులు ఆ నివేదికలో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, 40.5 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 68 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరం అని పేర్కొన్నారు. ఇసుక ప్రభుత్వ పరిధిలోనే ఉండడంతో.. ఇందిరమ్మ ఇళ్లకు మార్కెట్ ధర కంటే తక్కువకే అందజేసేలా మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇక సిమెంట్ బస్తా ధర రూ.260కి పైగా, ఉక్కు ధర ఒక మెట్రిక్ టన్నుకు రూ.49 వేల నుంచి రూ.54 వేల వరకు ఉంది. ఈ రెండు అంశాలపై సంబంధిత కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉక్కు కొనుగోలు అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
నమూనా ఇళ్ల నిర్మాణం షురూ
రాష్ట్రంలోని 500 మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను నిర్మించాలని సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే..! రూ.5 లక్షలతో.. 400 చదరపు అడుగుల్లో ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలనేదానిపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఇళ్లను నిర్మిస్తోంది. ఈ పథకాన్ని పర్యవేక్షించే గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ) ఈ ఇళ్లను తమ కార్యాలయాలుగా వినియోగించుకుంటారు. 500 మండలాల్లో 474 చోట్ల స్థలాల ఎంపిక జరగ్గా.. ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని 23 చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నమూనా ఇళ్ల వద్దే.. నిర్మాణ ఖర్చు ఎంత అవుతుందనే వివరాలను ప్రదర్శించనున్నారు.
80.5 లక్షల దరఖాస్తులు
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 80.50 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిల్లో 69,83,895 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి, 10,70,659 జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి వచ్చాయి. వీటిల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 30.83 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 74,380 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. పూర్తయిన దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి 9,19,676 మంది వివరాలను ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేశారు. నల్లగొండ నుంచి అత్యధికంగా 4,31,831 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి జిల్లా(3,75,013), ఖమ్మం(3,57,869), సూర్యాపేట(3,09,062), నిజామాబాద్(3,20,831), సంగారెడ్డి(3,18,775) జిల్లాలు ఉన్నాయి.