Share News

Dana Kishore: ఎవరినీ బలవంతంగా తరలించం..

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:55 AM

మూసీ నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌ఎ్‌ఫడీసీఎల్‌) ఎండీ దాన కిశోర్‌ తెలిపారు.

Dana Kishore: ఎవరినీ బలవంతంగా తరలించం..

  • ఇష్టప్రకారమే మూసీ నిర్వాసితుల తరలింపు

  • పట్టాలు ఉన్నవారికి చట్టప్రకారం పరిహారం

  • అనధికార నిర్మాణాల బిల్డర్లపై కేసులు

  • పిల్లలు నష్టపోతారనే విద్యాసంస్థల్ని కూల్చలే

  • హైడ్రా బూచీ కాదు.. భరోసా

  • సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

  • పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి

  • దానకిశోర్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మూసీ నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌ఎ్‌ఫడీసీఎల్‌) ఎండీ దాన కిశోర్‌ తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సంవత్సరాల తరబడి ఉన్న ప్రాంతం వీడి వెళ్లలేని వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలమని, వారికి సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు నిర్మించుకున్నవారికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేస్తామని.. నదీ గర్బంలో నివాసం ఉన్న పేదలను ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకుంటుందని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఉపాధి, వసతుల కల్పన, ఇళ్ల కేటాయింపులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.


హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది తప్ప.. నిరుపేదల ఇళ్లను కాదన్నారు. నగరంలో విపత్తుల నిర్వహణ, ఆస్తుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతుండడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితుల తరలింపు, పునరావాసంపై గందరగోళం నెలకొన్న తరుణంలో ప్రభుత్వ ఉద్దేశం, చేపడుతున్న చర్యలపై దాన కిశోర్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో కలిసి సచివాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మూసీ నిర్వాసితులకు. రూ.30 లక్షల విలువ చేసే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయిస్తున్నాం.


అదనపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.700 కోట్లు మంజూరు చేస్తుంది. నిర్వాసితుల సంక్షేమం, ఉపాధి, వారి పిల్లల చదువులు, ఇతర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్నాం. పట్టా భూములు ఉన్నవారికి భూ సేకరణ చట్టం ప్రకారం చెల్లింపులు చేస్తాం. 3 జిల్లాల కలెక్టర్లు, పురపాలక శాఖ యంత్రాంగం నిర్వాసితుల తరలింపునకు పనిచేస్తున్నారు. 32 ఎన్జీవోలతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. మూసీ అభివృద్ధి పనులు 2 నెలల్లో మొదలు పెడతాం. అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ నదుల అభివృద్ధిలో పాలుపంచుకున్న ఏజెన్సీల నుంచి డీపీఆర్‌లు సేకరిస్తున్నాం. వాటి ఆధారంగా టెండర్లు పిలుస్తాం. నిర్వాసితులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తాం. నెల రోజుల్లో దీనిపై కార్యాచరణ సిద్ధమవుతుంది. పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి రుణాలిస్తాం’’ అని దాన కిశోర్‌ వివరించారు.


  • ప్రజలు మురికి కూపంలో ఉండకూడదనే..

మూసీ మురికి కూపంలో ఉంటున్న ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని దాన కిశోర్‌ చెప్పారు. 2026 నాటికి మూసీలో గోదావరి నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మూసీ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రూ.3,800 కోట్లతో 970 మిలియన్‌ లీటర్ల మురుగు నీటి శుభ్రత చేపడుతున్నామన్నారు. 116 ఏళ్ల క్రితం మూసీకి వరద వచ్చినప్పుడు పరివాహక ప్రాంతంలో నష్టపోయినవారి కోసం నిజాం చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. మూసీని ప్రపంచ పర్యాటక కేంద్రం చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌ ప్రక్షాళన చేపడుతున్నారని వివరించారు. పరివాహకంలోని చారిత్రక ఆనవాళ్లను సంరక్షించడంతో పాటు, సంప్రదాయ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు సంకల్పించారన్నారు. హైదరాబాద్‌ నగర జనాభా కోటికి పెరిగిందని, ఖైరతాబాద్‌లో 20 నిమిషాల్లో 9 సెం.మీ. వర్షం పడిందని, నగరం అంతా ఇదే స్థాయి వర్షం పడితే ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. మూసీ నదీ అభివృద్ధితో నగరం రూపురేఖలే మారిపోతాయన్నారు. పేదల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. 50 కి.మీ మేర మూసీ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో 23 ప్రదేశాల్లో ఉన్న ప్రజలను 14 చోట్లకు తరలిస్తున్నామని దాన కిశోర్‌ తెలిపారు.


  • నిర్మాణ అనుమతుల మంజూరుకు కొత్త టెక్నాలజీ

మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతుల మంజూరుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు దాన కిశోర్‌ తెలిపారు. 3డీ సాంకేతిక పరిజ్ఞానంతో అనుమతులు పొందిన ఇంటిని.. బయటి నుంచే ఇచ్చిన కొలతల ప్రకారం ఉందా లేదా, ఉల్లంఘనలు జరిగాయా అని పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఈ సాంకేతికతను రెరాకు ఇస్తున్నామన్నారు. ప్రతి వ్యవస్థలో తప్పలు ఉంటాయని, అలా చేసిన అధికారులను శిక్షిస్తున్నామని చెప్పారు. భవనాల అనుమతులను నిబంధనల ప్రకారమే మంజూరు చేస్తున్నారన్నారు. దుర్గం చెరువు బఫర్‌ జోన్‌ విషయంలో కొంత సందిగ్ధత ఉందని, నీటి పారుదల శాఖ అధికారులు నివేదిక రూపొందించి కోర్టుకు అఫిడివిట్‌ ఇస్తున్నట్లు చెప్పారు.


ఉన్నత విద్యావంతులు కూడా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన అన్ని మ్యాప్‌లను హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, రెరా వెబ్‌సైట్లలో పెడుతున్నామన్నారు. ఓఆర్‌ఆర్‌ ఆవల ఉన్న 565 చెరువుల్లో 563 చెరువులకు ప్రిలిమనరీ నోటిఫికేషన్‌, 133 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ లోపల 2,693 చెరువులకు గాను 2,052 చెరువులకు ప్రిలిమినరీ, 138 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ యాప్‌ రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు. స్థలాలు, ఇళ్లు కొనేవారు ఆ యాప్‌ ద్వారా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ వివరాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.


  • తప్పుడు ప్రచారంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య

అనధికారిక నిర్మాణాలతో ప్రజలను మోసం చేసిన బిల్డర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు రంగనాథ్‌ తెలిపారు. ఇందుకు కారకులైన ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య బాధాకరంగా పేర్కొన్నారు. తప్పుడు ప్రచారంతో ఆమె భయాందోళనలకు గురై బలవన్మరణానికి పాల్పడిందన్నారు. జొన్వాడ్‌ ఫాం హౌస్‌ జీవో 111 పరిధిలో ఉందన్నారు. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదని రంగనాథ్‌ వివరించారు. అమీన్‌పూర్‌లో భారీగా భూములు అన్యాక్రాంతం అయినట్లు చెప్పారు. సున్నం చెరువులో వెంకటేష్‌ అనే వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేశారని, ఆయన ట్యాంకర్ల వ్యాపారంతో రోజుకు రూ.లక్ష సంపాదిస్తున్నారన్నారు. పేదలను ముందు పెట్టి స్వప్రయోజనాల కోసమే అలా వ్యవహరించినట్లు రంగనాథ్‌ చెప్పారు. వెంకటేష్‌ ఇప్పుడు 20 ట్యాంకర్లతో ఇప్పుడు మళ్లీ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు.


  • హైడ్రా కమిషనర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ కేసు..

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ)లో కేసు నమోదైంది. హైడ్రా తమ ఇళ్లు కూలుస్తుందన్న భయంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఆమె కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో 16063/ఐఎన్‌/224 కింద రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ వెల్లడించింది. కాగా, బుచ్చమ్మ మరణానికి హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. ఎవరికీ తాము నోటీసులివ్వలేదని రంగనాథ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే..


  • అనుమతులున్న వాటిని కూల్చడం లేదు: రంగనాథ్‌

హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ, పంచాయతీ నుంచి పక్కాగా అనుమతులున్న భవనాలను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల మీద వస్తున్న ఫిర్యాదులపైనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము కూల్చిన భవనాలు వేటికీ అనుమతులు లేవని తెలిపారు. అనుమతులు ఉన్న ఏ భవనం జోలికీ వెళ్లలేదన్నారు. రాత్రికిరాత్రే వెళ్లి ఎవరి ఇంటిని కూల్చడం లేదని.. ముందస్తు సమాచారం ఇచ్చిన తరువాతనే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో అపోహలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నిజమైన పేదలకు హైడ్రాతో అన్యాయం జరగదన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేసినా.. దాని పక్కన ఉన్న పేదల నివాసాల జోలికి వెళ్లని సంగతిని గుర్తుచేశారు.


  • విద్యా సంవత్సరం ముగిశాక కాలేజీలపై చర్యలు

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన కళాశాలలపై ఫిర్యాదులు వచ్చాయని.. పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోతారనే వాటిపైన చర్యలు తీసుకోలేదని రంగనాథ్‌ పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ముగిశాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు ప్రైవేటు సర్వే నంబరుతో అనుమతులు తీసుకుని నిర్మాణాలను మాత్రం ప్రభుత్వ సర్వే నంబర్లలో చేస్తున్నట్లు చెప్పారు. దుండిగల్‌లో పాత తేదీలతో పంచాయతీ కార్యదర్శి అనుమతులు పొందారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘‘ అమీన్‌పూర్‌లో ఓ ఆస్పత్రిలో రోగులు ఉండగా కూల్చామని చెప్పడం అవాస్తవం. మూడుసార్లు హెచ్చరికలు చేసినా మళ్లీ మళ్లీ నిర్మాణాలు చేస్తుండడంతో హైడ్రా ఏర్పాటయ్యాక నేలమట్టం చేశాం.


ఆ సమయంలో వీడియో తీశాం. అక్కడ రోగులు ఎవరూ లేరు. ఆస్పత్రి పేరుతో అక్రమ కట్టడం తప్ప ఆ భవనంలో ఆస్పత్రి లేదు. పేదలను ముందుపెట్టి కొందరు పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని తెలిపారు. హైడ్రాను ఓ బూచీగా చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. హైడ్రా భరోసా మాత్రమేనని తేల్చి చెప్పారు. వరదలు, విపత్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడి, భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూసేందుకే హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ చర్యలు చేపడుతుందే తప్ప పేదల నివాసాలను కూల్చేందుకు కాదన్నారు. అధిక శాతం మీడియా పూర్తి సహకారం అందిస్తున్నా.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంతో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని తెలిపారు.


  • ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాపాడుకోలేం

ముందుగా సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయడం లేదని.. తగిన సమయం ఇచ్చాకే ఆక్రమణలను నేలమట్టం చేస్తున్నట్లు రంగనాథ్‌ పేర్కొన్నారు. పేదలు మధ్య తరగతి వారు చెరువులను ఆక్రమించరని.. అక్రమ కట్టడాల వెనుక పెద్దలు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను తీసుకొచ్చారని.. చెరువులు, నాలాలను కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు కాకుంటే వాటిని మరెప్పటికీ కాపాడుకోలేమని తేల్చి చెప్పారు. జొన్వాడ్‌ ఫాం హౌస్‌ జీవో 111 పరిధిలో ఉందన్నారు. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదని రంగనాథ్‌ వివరించారు.

Updated Date - Sep 29 , 2024 | 03:55 AM