Share News

Employee Transfers: ఉద్యోగుల బదిలీలకు మరో 10 రోజుల గడువు

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:44 AM

కొన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం, వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు మరో 10 రోజుల గడువు ఇచ్చింది.

Employee Transfers: ఉద్యోగుల బదిలీలకు మరో 10 రోజుల గడువు

  • ఈ నెల 31 వరకు చాన్స్‌ అవకాశం ఇచ్చిన సర్కారు

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కొన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం, వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు మరో 10 రోజుల గడువు ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామృకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 19 నుంచి 20లోపు అన్ని శాఖల్లోని ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు అందుకున్న నాటి నుంచి మూడు రోజుల్లోగా కొత్త పోస్టుల్లో చేరాలి.


అయితే కొన్ని శాఖలు, విభాగాల్లో బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు. ఒక ప్రదేశంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగిని బదిలీ చేయాలన్న నిబంధన మేరకు కొన్ని శాఖల్లో జాబితాలను సరిగా తయారు చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల ఉద్యోగుల సీనియారిటీని సక్రమంగా లెక్కించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. వైద్య ఆరోగ్య శాఖ, ప్రణాళిక శాఖ వంటి వాటిలో ఉద్యోగ సంఘాల ఆఫీస్‌ బేరర్ల పేరిట బదిలీల నుంచి తప్పించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పెంచింది. ఈలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖలను ఆదేశించింది. ఆ తర్వాత సాధారణ బదిలీలపై ఆగస్టు 1 నుంచి నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Updated Date - Jul 21 , 2024 | 04:44 AM