Public Health: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:21 AM
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆస్పత్రుల్లో నియామకాలపైనా దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయ పరిమితి రెండింతలు.. వైద్య ఆరోగ్య శాఖలో 7,750 పోస్టుల భర్తీ
మరో 6,494 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
8 వైద్య కాలేజీలు అందుబాటులోకి
ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు: సీఎంవో
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముందెన్నడూ లేని విధంగా ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు, ఆస్పత్రుల్లో నియామకాలపైనా దృష్టి సారించారని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రెండింతలు చేసినట్లు గుర్తుచేసింది. తొలి ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టామని, నూతన వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలను మంజూరు చేశామని వివరించింది. మెడికల్ కాలేజీల్లో సీట్లు, ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుల జారీ పైలెట్ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది.
ఆరోగ్యశ్రీ కింద నెలకు 73 కోట్ల వ్యయం
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 2014 నుంచి 2023 అక్టోబరు వరకు గత ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే.. 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం నెలకు సగటున రూ.76 కోట్లను వ్యయం చేసిందని సీఎంవో తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20ు వరకు పెంచామని, కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని, దీంతో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1,835కి పెరిగిందని వివరించింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా రూ.487.29 కోట్లను కేటాయించామని పేర్కొంది.
ఉద్యోగ నియామకాలు...
ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీల భర్తీ విషయంలో గత సర్కారు నిర్లక్ష్యం చేసిందని సీఎంవో ఆక్షేపించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే వైద్య ఆరోగ్య శాఖలో 7,750 పోస్టులను భర్తీ చేశామని తెలిపింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ) ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్లను జారీ చేశామని, ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులు, 308 ఫార్మాసి్‌స్ట(ఆయుష్) పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని తెలిపింది. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ చెల్లింపులు, ఇతర పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించామని పేర్కొంది.
కొత్తగా 8 వైద్య కళాశాలలు
8 నెలల కాలంలోనే కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎంవో విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,090కి పెరిగిందని పేర్కొంది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్‌లో 50 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ, 50 సీట్లతో ఫిజియోథెరపీ కాలేజీ, 30 సీట్లతో పారామెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని వివరించింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు కొత్త భవన సదుపాయాల కోసం రూ.204.85 కోట్లను మంజూరు చేశామని తెలిపింది. ఏడాది కాలంలోనే 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కాలేజీలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొంది. కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామని, 20 డయాలసిస్ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. ఇన్ఫెర్టిలిటీ సమస్యలున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించామని, ఈ మేరకు గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింది. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపింది. రూ.వెయ్యి కోట్లతో రెండు సంవత్సరాల్లో ఈ ట్రామాకేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నామని వివరించింది. ఇంతకు ముందు సేవలు అందని మండలాల్లో రూ.30 కోట్లతో 222 నూతన 108 అంబులెన్సులను అందించనున్నామని తెలిపింది.