Formula E race: తేల్చేద్దాం.. కారు కథ
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:22 AM
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఫార్మూలా ఈ-రేస్‌పై దర్యాప్తునకు ఏసీబీకి అనుమతి
అనుమతిచ్చిన సర్కారు.. జేడీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
వచ్చే వారం రంగంలోకి.. ఐఏఎస్ సహా పలువురికి నోటీసులు
స్టేట్‌మెంట్ల ఆధారంగా అప్పటి ప్రజాప్రతినిధులపై దృష్టి
హైదరాబాద్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చింది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చేందుకు పచ్చజెండా ఊపింది. అవినీతికి బాధ్యులైనవారు ఎంతటివారైనా వదలొద్దని స్పష్టం చేసింది. ఈ రేస్‌లో రూ.55 కోట్లు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్ శాఖ.. మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎ్‌సలు సహా అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే వారం నుంచి ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఉన్నత స్థాయి కేసు కావడంతో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) విభాగానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.
సీఐయూ జాయింట్ డైరెక్టర్ (జేడీ) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి నిర్విరామంగా కేసు విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న జేడీ సోమవారం విధుల్లో చేరనున్నారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత వచ్చే వారం నుంచి కేసుతో సంబంధం ఉన్నవారందరికీ విడివిడిగా నోటీ్‌సలు ఇచ్చి, విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నారు. ఐఏఎ్‌సలు మొదలు కీలక అధికారులు, నాటి ప్రజాప్రతినిధుల దాక వీరిలో ఉండే అవకాశం ఉంది. స్టేట్‌మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలకు నోటీ్‌సలు జారీ చేసి ప్రశ్నించే వీలుంది. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అయితే, నాటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎక్కడా నోట్ ఫైల్ గానీ, ఆదేశాలిస్తూ పత్రాలు కానీ జారీ చేయలేదు. ఇప్పుడు విచారణ సంస్థకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అధికారులది. వారు ఏసీబీకి ఏం చెప్పనున్నారు..? ఎలాంటి ఆధారాలు సమర్పించనున్నారు..? వాటి ఆధారంగా గత సర్కారులోని కీలక ప్రజాప్రతినిధుల వరకు ఏసీబీ ఎలా చేరుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే
2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. సచివాలయం ఎదురుగా ట్యాంక్‌బండ్ చుట్టూ ప్రత్యేకంగా సుమారు మూడు కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దీంతో 2024 ఫిబ్రవరి 10న రెండోసారి రేస్ నిర్వహించేందుకు 2023 అక్టోబరులోనే విదేశీ సంస్థలతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విదేశీ సంస్థలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-అర్బన్ డెవల్‌పమెంట్ (ఎంఏయూడీ) రూ.55 కోట్లు చెల్లించింది. అయితే, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మారిన వెంటనే విదేశీ సంస్థలు తాము ఫార్ములా ఈ ఆపరేషన్ నిర్వహించడం లేదని ప్రకటించాయి. ఒప్పందంలో ప్రస్తావించిన అంశాలు పాటించకపోవడమే కారణంగా పేర్కొన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఆర్థిక శాఖ, ఇతర విభాగాల నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు చెల్లించినట్లుగా తేల్చింది.