Share News

Kaleshwaram Project: బ్యారేజీల అధ్యయనం, మరమ్మతులు ఏకకాలంలో!

ABN , Publish Date - May 19 , 2024 | 04:23 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ)తో అధ్యయనం చేయించనున్నారు.

Kaleshwaram Project: బ్యారేజీల అధ్యయనం, మరమ్మతులు ఏకకాలంలో!

  • నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు

  • మూడు బ్యారేజీల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు

  • రేవంత్‌ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం

  • రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి

  • సర్టిఫికెట్లిచ్చినా నిర్మాణం పూర్తికానట్లే లెక్క

  • సీఎం స్పష్టీకరణ.. వారంలో కాళేశ్వరానికి

  • రేవంత్‌ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం

  • మరమ్మతు ఖర్చు నిర్మాణ సంస్థలదే

  • అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ)తో అధ్యయనం చేయించనున్నారు. బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఈ మూడు సంస్థలతో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది. నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, అధికారులు చర్చించారు. ఇతర మంత్రులు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి?


బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ్డి ఆరా తీశారు. బ్యారేజీల అధ్యయనంతో పాటు రిపేర్లు ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు. సమాంతరంగా చేపట్టడం వల్ల నాలుగు వారాల్లోగా మరమ్మతులు, పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పరీక్షలపై నోడల్‌ అధికారిగా నీటి పారుదల శాఖలోని డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజనీరును నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకొని, వెనువెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు. ఆనకట్టల భద్రత జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు. 2019 జూన్‌లో మూడు బ్యారేజీలు ప్రారంభం కాగా... అదే సంవత్సరం వచ్చిన వరదలకు బ్యారేజీలు దెబ్బ తిన్నాయని, 2019 నవంబరులోనే లోపాలు బయట పడ్డాయని నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు నివేదించారు. బ్యారేజీల నిర్మాణం పూర్తి కాకముందే పూర ్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేశారని, ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని, బ్యారేజీలు పూర్తి కానట్లుగానే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు నివేదించారు. పూర్తయిన ఆర్నెల్లకే లోపాలు బయట పడినందున వాటిని సరి చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని, లోపాలు బయట పడినప్పుడే ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని అధికారులు చెప్పారు. పునరుద్ధరణ/మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలు భరించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.


వారం రోజుల్లో కాళేశ్వరం పంపుల వద్దకు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం(అన్నారం), కాసిపేట(సుందిళ్ల) పంప్‌హౌ్‌సలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను పరిశీలించినప్పటికీ పంప్‌హౌ్‌సలను మాత్రం పరిశీలించలేదు. బ్యారేజీల్లో నీటిని నిల్వచేస్తే పంప్‌హౌ్‌సలు పంపింగ్‌కు అనుకూలంగా ఉన్నాయా? లేవా? అనేది వారం రోజుల్లో జరిగే పర్యటనలో ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.


బ్యారేజీలపై క్యాబినెట్‌లో చర్చిస్తాం: రేవంత్‌

మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బ్యారేజీలను రిపేర్లు చేయా లా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శనివారం మంత్రివర్గ సమావేశం జరగకపోవడంతో ఎన్‌డీఎ్‌సఏ నివేదికలోని కీలకమైన అంశాలపై చర్చించలేక పోయామని చెప్పారు.


సుందిళ్ళ ఖాళీ!

  • ఐదు గేట్లు ఎత్తి నీటి విడుదల

  • మరమ్మతుల కోసమే?

    మంథని రూరల్‌, మే 18: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ళ బ్యారేజీలో ఐదు గేట్లను ఎత్తి నిల్వ ఉన్న కొద్దిపాటి నీటిని శనివారం దిగువకు విడుదల చేశారు. నీటి విడుదలకు సంబంధించిన కారణాలను వెల్లడించలేదు. బ్యారేజీ పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. చేపలను పట్టుకోవడానికి జనం ఎగబడుతున్నారు. మరమ్మతుల కోసమే నీటిని దిగువకు వదిలినట్లు చర్చ జరుగుతోంది.


  • మరమ్మతు చేసినా7వ బ్లాక్‌కు గండమే

  • ఎన్‌డీఎస్‌ఏ కూడా అదే చెప్పింది

  • మంత్రి ఉత్తమ్‌

  • 2019లోనే లోపాలు: ఉత్తమ్‌

2019 జూన్‌లో కాళేశ్వరం బ్యారేజీలు ప్రారంభం కాగా... అదే ఏడాది నవంబరులో వరదల అనంతరం గేట్లు మూయగానే సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు చెల్లాచెదురు అయ్యాయని, బ్యారేజీ లోపల, బయట అఫ్రాన్లు కూడా దెబ్బతిన్నాయని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా రిపేర్‌లు చేయలేదని నీటి పారుదల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. ఇక మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్‌ బ్లాక్‌కు మరింత నష్టం జరగకుండా ప్రస్తుత పరిస్థితిలో నిర్వహించే ఎలాంటి నివారణ చర్యలైనా తాత్కాలికమేనని, మరింత దెబ్బతినకుండా యధాతథ స్థితిని కొనసాగించడం కోసమే ఈ మరమ్మతులని చెప్పారు. ఈ మరమ్మతుల తర్వాత కూడా అత్యంత విపత్కర పరిస్థితిలో ఉన్న 7వ బ్లాక్‌ మరింత ముప్పుకు గురయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ నివేదికలో ఉందని ప్రస్తావించారు.

Updated Date - May 19 , 2024 | 04:23 AM