Share News

Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:58 AM

ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ దిశగా వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటి దాకా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను నేరుగా తీసుకుని స్ర్కూట్నీ చేస్తున్నారు.

Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

  • ఉద్యోగులు, పింఛనుదారులకు ఊరట

  • ప్రస్తుతం నేరుగా బిల్లులు అందించాల్సిన పరిస్థితి

  • డీఎంఈ స్ర్కూటినీకే ఐదారు నెలలపైగా సమయం

  • ఆ ఇబ్బందులను పరిష్కరించేలా సర్కారు నిర్ణయం

  • స్క్రూటినీని ఆరోగ్యశ్రీ టస్ట్‌కు అప్పగించే యోచన

  • ఆస్పత్రుల బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు

హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ దిశగా వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటి దాకా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను నేరుగా తీసుకుని స్ర్కూట్నీ చేస్తున్నారు. దాంతో ఒక్క వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలోనే మెడికల్‌ బిల్లుల స్ర్కూట్నీకి కనీసం ఐదారు నెలల సమయం పడుతోంది. ఆన్‌లైన్‌ చేయడం వల్ల రోజుల వ్యవధిలోనే స్ర్కూట్నీ ప్రక్రియ పూర్తయి, వేగంగా నగదు అందే అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపి 25-30 లక్షల మంది దాకా ఉన్నారు. వీరు ఏదైనా వ్యాధి బారినపడి చికిత్స పొందినా.. లేక శస్త్ర చికిత్స చేయించుకున్నా.. ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది.


రూ.50వేలలోపు బిల్లులైతే జిల్లా స్థాయిలో, రూ.2లక్షల్లోపు ఉన్న బిల్లు అయితే డీఎంఈ కార్యాలయం స్ర్కూట్నీ చేసి.. నిధులు మంజూరు చేస్తుంది. అంతకు మించి బిల్లు ఉంటే.. ప్రభుత్వం వేసిన కమిటీ పరిశీలించి.. ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తుంది. సాధారణంగా మెడికల్‌ బిల్లులను తాము పనిజేస్తున్న శాఖ విభాగాధిపతి ద్వారా రీయింబర్స్‌మెంట్‌ కోసం పంపాలి. ఆ శాఖ నుంచి వైద్యవిద్య సంచాలకుల కార్యాలయానికి సదరు బిల్లు వస్తుంది. అక్కడ వైద్యుల బృందం ఆ బిల్లులను పరిశీలిస్తుంది. బిల్లు విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే.. కొంత మేర కోత పెడుతుంది. అయితే, ఈ బిల్లులను స్ర్కూట్నీ చేసే విషయంలో డీఎంఈ కార్యాలయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలకు సగటున 4-5 వేల బిల్లులు (ఏటా50-60 వేలు) వస్తుండగా.. రోజుకు కనీసం 150 బిల్లులను స్ర్కూట్నీ చేయాల్సి వస్తోంది. సెలవులు, సమయం సరిపోకపోవడం వంటి కారణాలతో స్ర్కూట్నీ చేయాల్సిన బిల్లుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.


ప్రస్తుతమైతే.. బిల్లు అందినప్పటి నుంచి స్ర్కూట్నీ పూర్తి కావడానికి ఐదారు నెలలు పడుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక నుంచి ఉద్యోగులు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను వారి మాతృశాఖ నుంచే ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం డీఎంఈ పరిధిలో 34 మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులు, హైదరాబాద్‌లోని స్పెషాలిటీ ఆస్పత్రుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల స్ర్కూట్నీ బాధ్యతలను డీఎంఈ నుంచి తప్పించి.. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు అప్పగించాలని సర్కారు భావిస్తోంది. తద్వారా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం ఏడాది నుంచి రెండేళ్ల దాకా ఆగాల్సిన అవసరం తప్పడంతోపాటు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఊరట దక్కనుందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - Nov 09 , 2024 | 04:58 AM