Share News

Land Acquisition: ఫ్యూచర్‌ సిటీ దిశగా..

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:07 AM

హైదరాబాద్‌ నగర శివార్లలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌ సిటీ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అక్కడికి రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణకు శ్రీకారం చుట్టింది.

Land Acquisition: ఫ్యూచర్‌ సిటీ దిశగా..

  • 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి భూసేకరణ

  • 449.27 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ

  • భూములకు పారదర్శకంగా హేతుబద్ధమైన పరిహారం

  • వాటిలో క్రయవిక్రయాలు జరపొద్దని ఆదేశం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ నగర శివార్లలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌ సిటీ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అక్కడికి రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. రావిర్యాలలోని ఔటర్‌ రింగురోడ్డు ఎగ్జిట్‌ 13 నుంచి ఫ్యూచర్‌ సిటీలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ యూనివర్సిటీ వరకు 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం కోసం భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల రీత్యా ఆరు లేన్ల రహదారికి 449.27 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి వెంటే మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్ధు-ఏ గ్రామంతోపాటు ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్‌, కందుకూరు మండలంలోని లేమూరు, రాచలూరు, తిమ్మాపూర్‌, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల్లో ఈ భూసేకరణ చేస్తున్నారు. ఇందుకుగాను భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకంగా హేతుబద్ధమైన పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది.


భూసేకరణచట్టం-2016 (యాక్ట్‌ 21/2017)తోపాటు పునరావాస కల్పన చట్టం-2013 (యాక్ట్‌ 20/2013) ద్వారా భూసేకరణ చేస్తున్నట్లు వెల్లడించింది. నోటిఫికేషన్‌ ప్రకారం.. మహేశ్వరం మండలంలోని కొంగరకుర్ధు-ఏ గ్రామంలో 53.20 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని ఫిరోజ్‌గూడలో 1.03 ఎకరాలు, కొంగరకలాన్‌లో 55.05 ఎకరాలు, కందుకూరు మండలంలోని లేమూరులో 84.28 ఎకరాలు, రాచలూరులో 87.22 ఎకరాలు, తిమ్మాపూర్‌లో 47.02 ఎకరాలు, గుమ్మడివెల్లిలో 32.11 ఎకరాలు, పంజాగూడలో 18.33 ఎకరాలు, మీర్‌ఖాన్‌పేటలో 62.08 ఎకరాలు సేకరిస్తున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న భూ యజమానులెవరూ చట్టంలోని సెక్షన్‌ 11(4) కింద ఈ భూమిలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి రుణాల కోసం కూడా ఈ భూములను తాకట్టు పెట్టరాదని సూచించింది. భూసేకరణపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా కలెక్టర్‌కు తెలియచేయాలని పేర్కొంది. ఇదిలా ఉండగా 300 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ప్రస్తుతం ఆరులేన్లకే పరిమితం చేసినప్పటికీ.. భవిష్యత్తులో దీనిని ఎనిమిది లేన్లుగా విస్తరించనున్నట్లు తెలిసింది. అలాగే దీనికి ఆనుకునే సమాంతరంగా మెట్రో రైల్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 04:07 AM