Share News

Hyderabad: స్పీకర్‌పై హైకోర్టు అజమాయిషీ చెల్లదు

ABN , Publish Date - Nov 07 , 2024 | 02:43 AM

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌.. హైకోర్టుకు సబార్డినేట్‌ కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Hyderabad: స్పీకర్‌పై హైకోర్టు అజమాయిషీ చెల్లదు

  • హైకోర్టుకు శాసనసభాపతి సబార్డినేట్‌ కాదు

  • ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో విచారణ

  • చేపట్టాలని బెదిరించినట్లుగా ఉత్తర్వులు

  • లేదంటే ఉరి తీస్తా అన్నట్లుగా ధోరణి ఉంది

  • సింగిల్‌ జడ్జి.. పరిధి మీరి వ్యవహరించారు

  • స్పీకర్‌ తీర్పు ఇచ్చేదాకా న్యాయసమీక్ష వీల్లేదు

  • హైకోర్టు ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌.. హైకోర్టుకు సబార్డినేట్‌ కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. స్పీకర్‌పై హైకోర్టు అజమాయిషీ చేస్తానంటే కుదరదని, స్పీకర్‌ విశేషాధికారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్లలో.. అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం (శాసనసభ వ్యవహారాల శాఖ) మద్దతు తెలిపింది. విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్‌ ఇవ్వాలని, ఆ పిటిషన్‌లను స్పీకర్‌ ఎదుట ఉంచాలని సింగిల్‌ జడ్జి తీర్పు ఇవ్వడం, ఆలోగా విచారణ ప్రారంభించకపోతే తాము సుమోటోగా కేసును తిరిగి ఓపెన్‌ చేస్తామనడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. అసెంబ్లీ కార్యదర్శి అప్పీళ్లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. ‘‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కింద విశేషాధికారాలు చెలాయించే స్పీకర్‌.. హైకోర్టుకు సబార్డినేట్‌ కాదు. ఎప్పుడు షెడ్యూల్‌ ఇవ్వాలి, ఎప్పుడు విచారణ చేపట్టాలి అనే అంశాలన్నీ స్పీకర్‌కు ఉన్న విచక్షణాధికారాలు. ఇందులో హైకోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుండదు. సింగిల్‌ జడ్జి బెదిరింపు ధోరణిలో తీర్పు ఇచ్చారు. ఇచ్చిన గడువులో విచారణ ప్రారంభించకపోతే ఉరి తీస్తా అన్నట్లుగా ఆదేశాలున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ల విచారణ షెడ్యూల్‌ను హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఎందుకివ్వాలి?నెలరోజుల్లో తేల్చాలని తహసీల్దార్‌కు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడం చెల్లదు. స్పీకర్‌కు నిరంతర ఆదేశాలు ఇస్తాం.. స్పీకర్‌పై నిరంతర నిఘా పెడతాం అంటే కుదరదు. సింగిల్‌ జడ్జి తన అధికార పరిధికి మించి స్పీకర్‌ విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకున్నారు. అనర్హత పిటిషన్‌లపై స్పీకర్‌ తుది తీర్పు ప్రకటించే వరకు న్యాయసమీక్షకు అసలు అవకాశం లేదు. స్పీకర్‌ తుది తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పరిమితంగానే న్యాయసమీక్షకు అవకాశం ఉంది. అది కూడా పునరుద్ధరించలేని విధంగా నష్టం జరుగుతున్న సందర్భంలో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం లేదా సస్పెండ్‌ చేయడం అనే రెండు సందర్భాల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవు’’ అని రవీంద్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు.


  • న్యాయసమీక్షకు పరిమిత అవకాశాలే..

పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. 1992 వరకు స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి న్యాయసమీక్షకు అవకాశం ఉండేది కాదన్నారు. స్పీకర్‌ అధికారాలపై న్యాయసమీక్ష అనే భావన కూడా లేదని తెలిపారు. కిహోటో హోలోహాన్‌ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగఽ ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాతే స్పీకర్‌ అధికారాలపై న్యాయసమీక్షకు అత్యంత పరిమిత స్థాయిలో విండో ఓపెన్‌ అయిందని పేర్కొన్నారు. అది కూడా స్పీకర్‌ తుది తీర్పు ప్రకటించిన తర్వాత మాత్రమే సమీక్షకు అవకాశం దొరికిందన్నారు. ‘‘కిహోటో హోలోహాన్‌ తీర్పును మళ్లీ నిర్వచిస్తూ ముగ్గురు సభ్యులు కలిగిన సుప్రీంకోర్టు సాధారణ ధర్మాసనం ఇచ్చిన కైశం మేఘాచంద్రసింగ్‌ తీర్పుపై ఆధారపడటం ప్రామాణికం కాదు. ఈ తీర్పు ప్రత్యేక సందర్భంలో ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దానికి ప్రామాణికత ఉండదు’’ అని శ్రీరఘురాం పేర్కొన్నారు. పార్టీ మారిన మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు ప్రారంభమైనప్పటికీ సమయం మించిపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది.

Updated Date - Nov 07 , 2024 | 02:46 AM