Share News

Hyderabad: రాయడం... చదవడం వస్తే కొలువు

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:07 AM

రాయడం... చదవడం వస్తే చాలు నివాసం ఉంటున్న గ్రామంలోనే నీటిపారుదలశాఖకు చెందిన కొలువు చేతికి రానుంది. ఆయకట్టుకు నీరందించే ప్రధాన కాలువలు, డ్యామ్‌లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ నిమిత్తం లష్కర్‌లను, హెల్పర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Hyderabad: రాయడం... చదవడం వస్తే కొలువు

  • నీటిపారుదలశాఖలో నియామకాలు

  • 1597 మంది లష్కర్‌లు,

  • 281 మంది హెల్పర్ల అవసరం

  • ప్రభుత్వ ఉత్తర్వులు.. ప్రక్రియకు కమిటీ

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాయడం... చదవడం వస్తే చాలు నివాసం ఉంటున్న గ్రామంలోనే నీటిపారుదలశాఖకు చెందిన కొలువు చేతికి రానుంది. ఆయకట్టుకు నీరందించే ప్రధాన కాలువలు, డ్యామ్‌లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ నిమిత్తం లష్కర్‌లను, హెల్పర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు 1597 మంది లష్కర్‌లు, గేట్ల ఆపరేషన్‌ కోసం 281 మంది హెల్పర్లను ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించుకోనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా, 45 ఏళ్లలోపు వయసు కలిగి... శారీరకదారుడ్యం ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600లు అందనుంది. ఈ నియామాకాల నేపథ్యంలో ప్రతీ ప్రధాన కాలువ పై నీటిపారుదలశాఖ నిఘా పెట్టనుంది.


ప్రధానంగా వానాకాలంలో ప్రాజెక్టులు, చెరువుల నుంచి విడుదలయ్యే నీరు పొలానికి చేరుతుందా...?లేదా...? ఎక్కడైనా కాలువ దెబ్బతిందా...? దెబ్బతింటే ఇసుక బస్తాలు వేసి కాలువను కాపాడుకోవడం వీరి బాధ్యత. కాలువలో ఎంత ఎత్తుతో నీళ్లు వెళ్తున్నాయి? ఏ మేరకు నీళ్లు అవసరం? ఆయకట్టుకు ఎంతమేర నీరందుతుందనే సమాచారం కూడా వీరే సేకరిస్తారు. ఇటీవలే భారీ వర్షాలకు నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు మూడుచోట్ల గండ్లు పడ్డాయి. పలు చెరువులు తెగిపోయాయి.


అయితే కాలువలపై పర్యవేక్షణ లేకపోవడంతోనే క్రమంగా చెట్లు, చెదలు పెరిగి, పూడిక కూడా చేరి, కాలువలు దెబ్బతింటున్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నియమాకాలకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. నియామక ప్రక్రియ చేపట్టడానికి వీలుగా సంబంఽధిత ఈఎన్‌సీ/సీఈ ఛైర్మన్‌గా, ఎస్‌ఈ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఏయే చోట్ల లష్కర్‌లను నియమించుకోవాలనుకుంటున్నారో ఆ సమీప గ్రామాల్లో నివాసం ఉండేవారికే అవకాశం కల్పించనున్నారు.

Updated Date - Oct 26 , 2024 | 04:07 AM