Share News

Outer Ring Road: ఇక హైడ్రా నోటీసులు..

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:25 AM

ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు ఇక ‘హైడ్రా’ ద్వారానే నోటీసులు జారీ చేయించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

Outer Ring Road: ఇక హైడ్రా నోటీసులు..

  • విధి విధానాలు రూపొందిస్తున్నాం

  • చెరువులు, స్థలాల పరిరక్షణ బాధ్యత ఆ ఏజెన్సీకే

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు ఇక ‘హైడ్రా’ ద్వారానే నోటీసులు జారీ చేయించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ)కు అప్పగిస్తామన్నారు. ఇలాంటి అంశాలతో కూడిన హైడ్రా విధివిధానాలను రూపొందిస్తున్నామని వివరించారు.


చెరువుల్లోని ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంపై సచివాలయంలో ఆమె గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు, జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నాయని అన్నారు. ఈ గందరగోళానికి తెరదించుతూ ఇకపై ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని రకాల ఆక్రమణల తొలగింపునకు ‘హైడ్రా’ ద్వారానే నోటీసులను జారీ చేయనున్నామని తెలిపారు.


ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన బాధ్యతను మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శికి అప్పగించినట్టు వివరించారు. అలాగే, జీహెచ్‌ఎంసీ యాక్ట్‌, తెలంగాణ ల్యాండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌ యాక్ట్‌, తెలంగాణ వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌(వాల్టా), నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారీ చేసే అన్ని రకాల నోటీసులు, ఆక్రమణల తొలగింపు వ్యవహారాలను హైడ్రా పరిధిలోకి తెస్తున్నామని చెప్పారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిరక్షణ బాధ్యతను కూడా జల మండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నామన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత పెంచి విభాగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం పోలీసు, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి సిబ్బందిని తీసుకుంటామని తెలిపారు. కాగా,. హైడ్రా కూల్చివేతల విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

Updated Date - Aug 30 , 2024 | 03:28 AM