Group-1 exams: ప్రశాంతంగా గ్రూప్-1 మెయిన్స్
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:34 AM
రాష్ట్రంలో గ్రూపు-1 మెయిన్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు (సోమవారం) ఇంగ్లిష్ క్వాలిఫై పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
తొలి రోజు ఇంగ్లిష్ క్వాలిఫై పరీక్ష.. 72ు మంది హాజరు
నేటి నుంచి సబ్జెక్టులవారీ పరీక్షలు.. కేంద్రాల వద్ద బందోబస్తు
ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు వెనక్కి!
మహిళా విశ్వవిద్యాలయం వద్ద కన్నీరు పెట్టిన ఓ అభ్యర్థి
గోడ దూకి వెళ్లేందుకు ఓ అభ్యర్థి యత్నం.. పట్టుకున్న అధికార్లు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూపు-1 మెయిన్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు (సోమవారం) ఇంగ్లిష్ క్వాలిఫై పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మంగళవారం నుంచి సబ్జెక్టులకు సంబఽంధించిన పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 46 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీటిని నిర్వహిస్తున్నారు. పరీక్ష మొదలు కావడానికి 30 నిమిషాల ముందు వరకూ వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించలేదు. 27వ తేదీ వరకూ జరగనున్న మెయిన్స్‌కు.. 31,383 మంది అభ్యర్థులు అర్హులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు క్రీడల కోటాలో మరో 20 మందిని ఎంపిక చేశారు. వీరిని కూడా పరీక్షలకు అనుమతించారు. కానీ, తొలిరోజు 22,750 మంది మాత్రమే (72.4 శాతం) పరీక్షకు హాజరయ్యారు.
ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు విభాగం అధికారులు ప్రణాళికా బద్ధంగా ముందుకుసాగారు. ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించి నిర్వహణను పర్యవేక్షించారు. పరీక్ష వాయిదా, జీవో 29 రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తీర్పు కోసం పలువురు అభ్యర్థులు మధ్యాహ్నం 12గంటల వరకు వేచిచూసినా నిరాశే ఎదురైంది. వాయిదాకు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో వారంతా ఉరుకులు, పరుగులతో కేంద్రాలకు చేరుకున్నారు. అయితే 1..30గంటలకు గేట్లను మూసివేయడంతో పలువురు నిరాశగా వెనుదిరిగారు. కోఠి మహిళా యూనివర్సిటీలోని పరీక్షా కేంద్రం గేటు మూసిన తర్వాత వచ్చిన ఉమాశ్రీలేఖ అనే అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో భోరున విలపించింది. ట్రాఫిక్ రద్దీ వల్ల ఆలస్యం అయిందని.. పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఎంతగా ప్రాధేయపడినా పోలీసులు ఆమెను లోపలికి పంపలేదు.
దీంతో ఆమె అరగంటపాటు అక్కడే కూర్చుని విలపించింది. మరోవైపు.. సికింద్రాబాద్ సర్దార్‌పటేల్ రోడ్డులోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో పరీక్ష రాయాల్సిన మాథ్యూస్ అనే అభ్యర్థి (ఓల్డ్‌బోయిన్‌పల్లి) 1.32 నిమిషాలకు సెంటర్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు అప్పటికే గేట్లు మూసేసి, లోపలికి అనుమతించక పోవడంతో మాథ్యూస్ కాలేజీ గోడ దూకి కేంద్రంలోకి ప్రవేశించాలని ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. సాయంత్రం 5గంటల తర్వాత వదిలిపెట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోకుండా పోలీసులు 163 సెక్షన్ అమలు చేశారు. కేంద్రాల్లోకి అభ్యర్థులు వెళ్లకుండా రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకుంటారనే అనుమానంతో గట్టి బందోబస్తు నిర్వహించారు. కాగా.. హైదరాబాద్‌లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయం వద్ద హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్ జిల్లాలోని పలు సెంటర్లను అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా. విజయేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ, భాస్కర్‌నగర్‌లోని జోగిన్‌పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లను కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. అభ్యర్థులకు పలుచోట్ల పోలీసులు, అధికారులు ‘ఆల్ ది బెస్ట్’ ప్లకార్డులతో స్వాగతం పలికారు.
కేటీఅర్ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్.. అశోక్ నగర్‌కు వెళ్లి ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయంటూ నిఘా వర్గాల సమాచారం ఉండడంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను అశోక్‌నగర్ వెళ్లబోనని కేటీఆర్ పలుమార్లు పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ సాయంత్రం వరకు బందోబస్తును కొనసాగించారు.
హాజరు శాతం ఇలా..
జిల్లా అభ్యర్థులు హాజరైనవారు శాతం సెంటర్లు
హైదరాబాద్ 5,613 4,896 87.23 08
మేడ్చల్ 17,779 12,000 67.49 27
రంగారెడ్డి 8,011 5,854 73.07 11