Gurukula Student's Nalgonda : కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు
ABN , Publish Date - Sep 18 , 2024 | 05:02 AM
‘కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు.. అన్నంలో పురుగులు వస్తున్నాయి. పాఠాలు సరిగా చెప్పడం లేదు. మా సమస్యలను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు చెబితే వారు బెదిరిస్తున్నారు’ అని నల్లగొండ జిల్లా తుమ్మడం (హాలియా)లోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నంలో పురుగులు, రుచిలేని కూరలు
ప్రిన్సిపాల్‌కు చెబితే బెదిరిస్తున్నారు
హాలియా బీసీ గురుకులంలో విద్యార్థినుల నిరసన
హాలియా, సెప్టెంబరు 17: ‘కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు.. అన్నంలో పురుగులు వస్తున్నాయి. పాఠాలు సరిగా చెప్పడం లేదు. మా సమస్యలను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు చెబితే వారు బెదిరిస్తున్నారు’ అని నల్లగొండ జిల్లా తుమ్మడం (హాలియా)లోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు మంగళవారం ఉదయం తరగతులు బహిష్కరించి పాఠశాల ఆడిటోరియంలో రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఈ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు 480మంది విద్యనభ్యసిస్తున్నారు... మంగళవారం ఉదయం 400మందికి పైగా విద్యార్థినులు ఆడిటోరియంకు చేరుకుని 2 గంటలపాటు బైఠాయించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ఉడకని అన్నం, నీళ్ల చారు, రుచి లేని కూరలను వడ్డిస్తున్నారని, తరచుగా తమకు ఫుడ్ పాయిజన్ అవుతోందని, పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం లేదని, ఈ విషయాలను ప్రస్తుత ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే బెదిరిస్తున్నారని, గత ప్రిన్సిపాల్‌నే తిరిగి రప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బీసీ గురుకులాల జాయింట్ సెక్రటరీ తిరుపతి, రీజనల్ కోఆర్డినేటర్ సంధ్య పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. కాగా, విద్యార్థినుల ఆందోళనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘పరిపాలనను గాలికి వదిలేసి నిత్యం రాజకీయాలు చేసే సీఎం రేవంత్‌కి తుమ్మడం(హాలియా) బీసీ గురుకుల విద్యార్థినుల ఆవేదన వినిపించడం లేదా?’ అని ట్వీట్ చేశారు.