Harish Rao: దాడి చేయించింది సీఎం, డీజీపీ కాదా?
ABN , Publish Date - Sep 14 , 2024 | 03:48 AM
‘‘ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించింది రేవంత్‌రెడ్డి, డీజీపీ కాదా?
మేం ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అరెస్టులా?
హత్యాయత్నం చేసిన వారికి బందోబస్తా?
రేవంత్‌దృష్టి పైసలపైనే.. పాలనపై లేదు
మీడియాతో మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్/నార్సింగ్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించింది రేవంత్‌రెడ్డి, డీజీపీ కాదా? హత్యాయత్నం చేసిన గాంధీని, ఆయన అనుచరులను మాత్రం బందోబస్తు మధ్య ఇంటికి పంపుతారా? మేం ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా?’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కోకాపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే గురువారం కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ఖ్యాతిని పాడు చేయొద్దని, పోలీసుల గౌరవాన్ని త గ్గించొద్దని... తాము సంయమనం పాటించామన్నారు.
కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టు చేసి.. మహబూబ్‌నగర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. తమకు కనీసం నీళ్లు ఇవ్వకుండా తిప్పిన పోలీసులు.. దాడులు చేసిన వాళ్లను కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించారని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని తమ ఎమ్మెల్యేపై దాడి చేసినప్పుడు రేవంత్‌కు, డీజీపీకి లా అండ్ ఆర్డర్ గుర్తు రాలేదా? అని నిలదీశారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడితే.. ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో అరాచక పాలన గురించి రాహుల్‌గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. దేశం బయట స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల గురించి మాట్లాడడం కాదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై మాట్లాడాలని సూచించారు.
పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగిందని రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టి కాయలు వేయడంతో రేవంత్ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. తొమ్మిది నెలలుగా పాలనపై కాకుండా.. పైసలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పెత్తనం ఏంటని కౌశిక్‌రెడ్డిని గాంధీ నిలదీయడంతోనే సెటిలర్ అంటూ కౌశిక్ మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రా నాయకుల మీద రేవంత్ కపట ప్రేమను ఒలకబోస్తున్నారని పేర్కొంటూ గతంలో చినజీయర్‌ను, యాదాద్రి ప్లాన్ ఇచ్చిన ఆనంద్ సాయిని ఆంధ్రోళ్లు అని సంబోధించిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తాము ఇలాంటి నిర్బంధాలు చూడలేదన్నారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న డీజీపీ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గుడ్డిగా రేవంత్ ఆదేశాలను అమలు చేయడం మాని.. విచక్షణతో పని చేయాలని, చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను కోరారు. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నాటి తొక్కిసలాటలో భుజం నొప్పి మొదలైందని, ఎమ్మారై స్కాన్ తీసి 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారని హరీశ్ తెలిపారు.