Share News

Harish Rao: ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:04 AM

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: ఎనుముల కాదు..  ఎగవేతల రేవంత్‌

హామీలు నెరవేర్చే వరకు అలాగే పిలుస్తాం.. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని మోసం

  • సీఎంకు ధైర్యం ఉంటే అశోక్‌ నగర్‌ వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాలి

  • మూసీ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు

తిమ్మాపూర్‌/గజ్వేల్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి తన పేరును ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మార్చుకోవాలని సూచించారు. ఇచ్చిన హమీలన్నీ నేరవేర్చే వరకు ఆయనను ఆ పేరుతోనే పిలుస్తామన్నారు. చీఫ్‌ మినిస్టర్‌ అని పిలిపించుకుంటారో, చీప్‌ మ్యాన్‌.. చీటింగ్‌ మ్యాన్‌ అని పిలిపించుకుంటారో ఆయనే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లిలో బీఆర్‌ఎస్‌ అలయ్‌బలయ్‌ కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు.


ఈ సందర్భంగాను, తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోనూ ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వాళ్లు గ్యారెంటీల గారడీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీతో కలిసి హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని సెంట్రల్‌ లైబ్రరీకి వెళ్లి ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఉద్యోగాలు అడుగుతున్న యువతను రాక్షసుల్లా వేధిస్తున్నారన్నారు. సీఎంకు ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా సెంట్రల్‌ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాలని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పటికి మూడు విడతల్లో కూడా పూర్తిస్థాయిలో చేయలేకపోయారన్నారు.


రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తప్ప దేశంలో ఎవ్వరూ లేరన్నారు. దేవుడిని కూడా మోసం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డినే చూస్తున్నామన్నారు. పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టమని ఓ అయ్యగారు తనకు చెప్పారని, రేవంత్‌ రెడ్డి వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని క్షమించాలని కోరేందుకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు పోతే తనపై కేసు పెట్టించారని హరీశ్‌రావు విమర్శించారు. రూ.15 వేల రైతుబంధు ఇస్తామని చేబితే ప్రజలు నమ్మి కాంగ్రె్‌సకు అధికారం ఇస్తే.. ఉన్న రూ.10 వేల రైతుబంధును కూడా బంద్‌ చేశారన్నారు. కాంగ్రె్‌సను గట్టిగా ప్రశ్నించకపోతే యాసంగికి కూడా రైతుబంధును ఎగ్గొడతారన్నారు.ముందేమో ధాన్యానికి బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ ఇప్పుడు సన్న వడ్లకే బోనస్‌ అంటోందన్నారు.


ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితేనే బోనస్‌ అంటున్నారని, రైస్‌ మిల్లర్లు కల్లాల వద్దకు వచ్చి క్వింటాలు వడ్లు రూ.3 వేలకు కొంటున్నారన్నారు ప్రభుత్వమేమో బోన్‌సతో కలిపి రూ.2,800 మాత్రమే ఇస్తానంటోందన్నారు. రైతులు తమ పంటలను ఎక్కడ అమ్మినా బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూసీ సుందరీకరణకు అడ్డొస్తే బుల్డోజర్‌ కింద వేసి తొక్కేస్తానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. చావడానికైనా సిద్ధమే కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, తేడా వస్తే రేవంత్‌ రెడ్డి పర్మినెంట్‌ కాదన్నారు. మూసీ నిర్వాసితులను ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం పరిధిలోకి తీసుకురావాలని హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో కేసు వేసి గెలిచిన గచ్చిబౌలిలోని 500 ఎకరాల్లో నిర్వాసితులకు 250 గజాల చొప్పున ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:04 AM