Harish Rao: కేటీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర
ABN , Publish Date - Oct 28 , 2024 | 03:56 AM
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జన్వాడ ఫాంహౌ్‌సలో డ్రగ్స్ పార్టీలంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
ఫాంహౌస్ ఘటన పక్కా స్కెచ్‌తో చేసిందే
కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకిది పరాకాష్ఠ: హరీశ్
కేటీఆర్ బావమరిది ఇంట్లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు
అడ్డుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు
హైదరాబాద్/రాయదుర్గం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జన్వాడ ఫాంహౌ్‌సలో డ్రగ్స్ పార్టీలంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. కేటీఆర్‌పై బురదజల్లడంలో భాగంగానే ఆయన బావమరిదిపై డ్రగ్స్ కేసంటూ కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్ పాకాల ఇంట్లో కుటుంబ వేడుక ఉందని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసన్నారు.
రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం శని, ఆదివారాల్లో బాంబులు పేలతాయనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే.. ఇది పక్కా స్కెచ్ అని స్పష్టమవుతోందని చెప్పారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు చేస్తున్న ప్రయత్నమిదని ఆరోపించారు. వృద్థులు, చిన్నపిల్లలు, దంపతులు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్, ఆయన భార్య ఆ ఫంక్షన్‌కు వెళ్లకపోయినా వెళ్లినట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. కుటుంబ సభ్యులను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, నిజాయితీగా ఉండాలని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని హరీశ్ కోరారు. కాగా, రాయదుర్గంలోని ఓరియన్ విల్లా్‌సలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, అతని సోఛీరుడు శైలేంద్ర నివాసాల్లో ఎక్సైజ్ పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. ఈ సమాచారం ముందే తెలియడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు; బాల్క సుమన్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఓరియన్ విల్లాస్ వద్దకు చేరుకున్నారు. ఎక్సైజ్ పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ విల్లా కేటీఆర్ బావమరిదిది కాదని, కేటీఆర్ ఉంటున్న ఇల్లని, దాన్ని సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ నిలదీశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయదుర్గం రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎవరు ఫిర్యాదు ఇచ్చారని జన్వాడ ఫాంహౌ్‌సలో తనిఖీలు చేశారని బాల్క సుమన్, వివేకానందలు ప్రశ్నించారు. అది కుటుంబ సభ్యులు చేసుకుంటున్న పార్టీ అన్నారు. అధికారులు సీఎం చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నారని ఆరోపించారు. ఇక జన్వాడ ఫాంహౌ్‌సకు ఓరియన్ విల్లా్‌సకు సంబంధం ఏమిటని, పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు నిర్వహిస్తారని మాజీ మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్ ప్రశ్నించారు.