Harish Rao: పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వరా?
ABN , Publish Date - Nov 23 , 2024 | 04:29 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పత్తి, మిర్చి, ధాన్యం రైతుకు గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం.. మద్యం విక్రయాలపై ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమంపై లేదెందుకు?
అదానీ నుంచి రేవంత్ పుచ్చుకున్నదెంత?: హరీశ్ రావు
ఖమ్మం/చింతకాని, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పత్తి, మిర్చి, ధాన్యం రైతుకు గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే, ఇప్పుడు ఆధరలో సగం ధర కూడా రావడంలేదని విమర్శించారు. మద్యం అమ్మకాలు తగ్గితే సమీక్ష నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర తగ్గుతున్నా సమీక్ష నిర్వహించేందుకు శ్రద్ధ చూపడంలేదని ఆరోపించారు. శుక్రవారం మాజీ మంత్రి పువ్వా డ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తదితరులతో కలిసి హరీశ్ రావు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
అనంతరం చింతకాని మండలం పొద్దుటూరు, లచ్చగూడెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన రైతు కుటుంబాలను, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యాన్ని కూడా సక్రమంగా కొనడంలేదని, సీసీఐ కూడా దళారుల వద్దే పత్తి కొనడం తప్ప రైతుల వద్ద కొనడంలేదని ఆరోపించారు. మద్దతు ధర ఇవ్వకపోవడంతో పత్తి రైతులు క్వింటాకు వెయ్యినుంచి రూ.1100 నష్టపోతున్నారని తెలిపారు. మిర్చి పంటకు గత ఏడాది క్వింటాకు రూ.23వేల వరకు ధర లభిస్తే ఇప్పుడు రూ.11వేల వరకే సగానికి సగం పడిపోయిందని పేర్కొన్నారు.
అప్పుడు అదానీని రానివ్వలేదు
అదానీని అరెస్టు చేయాలని రాహుల్‌గాందీ చెబుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి అదానీకి కాంట్రాక్టులు ఇస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రూ.100 కోట్ల చెక్ అదానీ నుంచి తీసుకున్నారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అదానీని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదని చెప్పారు. అదానీ నుంచి రేవంత్‌రెడ్డి ఎంత పుచ్చుకున్నారన్నదానిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొత్తగా పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు 6 లక్షల తులాల బంగారం బాకీ పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులుపెడితే సహించేదిలేదని ఆయన అన్నారు.
సర్వే వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ప్రజల పరిస్థితితేమిటి?
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రజల బతుకు వివరాలు బట్టబయలు చేయడమే ప్రభుత్వ సర్వే లక్ష్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నాడు ప్రజాపాలన దరఖాస్తులు నడిరోడ్డున పడ్డాయని, ఇప్పుడు మళ్లీ ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు నడి రోడ్డుపై పడ్డాయన్నారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి ఇది మరో నిదర్శనమన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతుందని విమర్శించారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సర్వే పత్రాలు రోడ్డుపై పడిన ఘటన పట్ల ప్రభుత్వం సీరియ్‌సగా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.