Share News

Harish Rao: కొడంగల్‌ నుంచే ప్రజల తిరుగుబాటు

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:22 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నుంచే ప్రజా వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదల భూములను అన్యాయంగా లాక్కోవాలని ప్రయత్నించినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు.

Harish Rao: కొడంగల్‌ నుంచే ప్రజల తిరుగుబాటు

ఎక్కడ తిరుగుబాటు జరిగినా అది బీఆర్‌ఎస్‌ కుట్రనా?.. అల్లుడిపై ప్రేమతో పేదల భూములను లాక్కుంటారా?

  • సంబంధం లేకున్నా నరేందర్‌రెడ్డి పై కేసు

  • మాజీ మంత్రి హరీశ్‌ ధ్వజం.

  • రేవంత్‌ది నీచ బుద్ధి: సబిత

హైదరాబాద్‌, కుషాయిగూడ, పరిగి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నుంచే ప్రజా వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదల భూములను అన్యాయంగా లాక్కోవాలని ప్రయత్నించినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు. ఫార్మా సిటీ కోసం కేసీఆర్‌ సేకరించిన 14 వేల ఎకరాల్లో కాకుండా, అల్లుడిపై ప్రేమ చాటుకునేందుకు పేద రైతుల పచ్చని భూములను లాక్కోవడం తగదని రేవంత్‌కు సూచించారు. దీనిని తాము అడ్డుకుని తీరతామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ తిరుగుబాటు చేసినా బీఆర్‌ఎస్‌ కుట్ర అని ఆరోపించడం తగదన్నారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడి, కుట్ర కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గురువారం హరీశ్‌ ములాఖత్‌ ద్వారా కలిశారు. కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని, రిమాండ్‌ రిపోర్టు చదివే అవకాశం కూడా ఇవ్వకుండా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని, నరేందర్‌రెడ్డి నిర్దోషిగా బయటపడడం ఖాయమని స్పష్టం చేశారు.


  • పరిగి సబ్‌ జైలులో సబిత పరామర్శ

జైలుకు పోయి వచ్చిన రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యా క ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపేందుకు పనిచేస్తున్నారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, దానిని ఎండగడుతున్నందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు చనిపోవాలని కోరుకోవడం నీచమైన బుద్ధి అని అన్నారు. రాష్ట్రంలో అంతా అల్లకల్లోలం, ఎక్కడచూసినా ఆందోళనలు జరుగుతున్నాయని, రైతులు, కూలీ లు నిరుద్యోగ యువత నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. రేవంత్‌ 11 నెలల్లో కక్షసాధింపు తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో పరిగి సబ్‌ జైలులో ఉన్నవారిని గురువారం వికారాబాద్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌, పరిగి మాజీ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి సబిత పరామర్శించారు. అరెస్టయినవారి కుటుంబ సభ్యులతో జైలు బయట మాట్లాడారు. అమాయకులను అన్యాయంగా జైలుకు పంపించారని, వారికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మహేశ్వరంలో 15 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు తలపెడితే కాలుష్యం వస్తుందన్న రేవంత్‌.. కొడంగల్‌లో ఫార్మా కంపెనీలకు ఎలా అనుమతిస్తారని సబిత నిలదీశారు. రైతులతో ఫోన్‌లో మాట్లాడారని నరేందర్‌రెడ్డిని జైలు పంపారని, ఫాంహౌజ్‌ దావత్‌, కార్‌ రేసిం గ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో ఇరికించి కేటీఆర్‌నూ జైలుకు పంపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. లగచర్లలో దాడే జరుగలేదని కలెక్టర్‌ అంటే.. దాడి జరిగిందని కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వారిని వదిలి, బీఆర్‌ఎస్‌ వాళ్లనే జైలుకు పం పారని సబితారెడ్డి తెలిపారు. కాగా, అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి గురువారం పరిగి పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించారు. ఘటనకు దారితీసిన తీరుపై వేర్వేరు విభాగాల నుంచి వచ్చిన నివేదికపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు లగచర్లలో గురువారం జన సంచారం కనిపించింది. మూడు రోజుల తర్వాత దుద్యాలలో ఇంటర్నెట్‌ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.


  • ప్రజలు తిరగబడితే కుట్రా?

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు బహిరంగంగా తిరుగుబాటు చేస్తే అది కుట్ర అవుతుందా?అని బీఆర్‌ఎస్‌ నేతలు, మాజీ మంత్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యకర్తల నుంచి ఫోన్లు వచ్చినంత మాత్రాన పట్నం నరేందర్‌రెడ్డిని నిందితుడిగా అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. ఈ మేరకు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివా్‌సగౌడ్‌ బీఆర్‌ఎస్‌ విలేకరులతో మాట్లాడారు. నరేందర్‌రెడ్డి కేటీఆర్‌కు ఫోన్‌ చేసినంత మాత్రాన ఆయన్ను నిందితుడిని చేస్తారా? అని ధ్వజమెత్తారు. నరేందర్‌ రెడ్డి అదే రోజున వ్యవసాయ అధికారులకు, డీజీపీకి ఫోన్‌ చేశారని మరి వారు కూడా నిందితులేనా అని నిలదీశారు.


  • కేటీఆర్‌ నివాసం వద్ద ఉత్కంఠ

లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయనున్నారంటూ జరిగిన ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. దీంతో హైదరాబాద్‌, నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసం వద్దకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేరుకున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఒక్కచోటుకి చేరడంతో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Nov 15 , 2024 | 03:22 AM