Harish Rao: రైతులను దగా చేసి విజయోత్సవమా ?
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:16 AM
రైతులను దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు పండగ పేరిట విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు.
రైతు డిక్లరేషన్ అమలులో విఫలమైనందుకే పండుగా
ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : రైతులను దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు పండగ పేరిట విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రైతు సంక్షేమానికి రూ.54,280కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తంలో రూ.27,486కోట్లు బీఆర్‌ఎస్ హయాంలో ఖర్చు చేసినవేనన్నారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయనందుకే రైతు పండుగ నిర్వహిస్తున్నారా ? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడాది కాలంలో రూ.40,800కోట్లు బాకీ పడిందన్నారు.అందులో రుణమాఫీ కింద రూ.14,000 కోట్లు, ఖరీఫ్ రైతుబంధు రూ.7,500కోట్లు, కౌలు రైతులకు మరో రూ.3,000కోట్లు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన రూ.16,00కోట్లు, పంటల బోనస్ రూ.3వేల కోట్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదిక ప్రకారం అకాల వర్షాలకు పంటనష్టం రూ.11,700కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రైతులకు బాకీ పడ్డ రూ.40,800కోట్లతోపాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతుభరోసా కూడా విడుదల చేసి పండుగ చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, మాగనూరు పాఠశాల సందర్శిస్తారనే కారణంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఖండించారు.