Share News

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:59 AM

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌రెడ్డి పాలన ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఆ రాయి ఇప్పుడు రైతులపై పడిందన్నారు.

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన

  • ఇండ్లు కూలగొట్ట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?: హరీశ్‌రావు

సంగారెడ్డి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌రెడ్డి పాలన ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఆ రాయి ఇప్పుడు రైతులపై పడిందన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం డప్పూరులో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. డప్పూరు, మల్గి, వడ్డీ గ్రామాల్లో 2,003 ఎకరాల భూములను ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్నదన్న ఆయన ఏటా మూడు పంటలు పండించే భూములను గుంజుకోవడం న్యాయమా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కోసం హైదరాబాద్‌ పక్కనే 15వేల ఎకరాలను గత ప్రభుత్వం సేకరిస్తే దానిని ఫోర్త్‌ సిటీగా మారుస్తానని చెప్పి ఫార్మాసిటీని పచ్చని పల్లెల్లో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.


రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా మారి 15వేల ఎకరాలతో వ్యాపారం చేయాలనుకుంటున్నారని హరీశ్‌ విమర్శించారు. మూసీనది సుందరీకరణ పేరిట ఇండ్లు కూల్చడం, ఫార్మాసిటీ కోసం భూములు కొల్లగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని ఆయన ధ్వజమెత్తారు. మూసీని శుద్ధి చేస్తా అంటూనే పాలవంటి మంజీరాను విషపూరితంగా మారుస్తారా అని హరీశ్‌ ప్రశ్నించారు. రైతులు భయపడాల్సిన పనిలేదని, తన ప్రాణాలు అడ్డుపెట్టయినా భూములను కాపాడుతానని ఆయన భరోసా కల్పించారు. డప్పూరు రచ్చబండ కార్యక్రమంలో పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. భూములను నమ్ముకొనే పిల్లలను చదివిస్తున్నామని, కుటుంబాలను పోషించుకుంటున్నామని చెప్పారు. ప్రాణాలు పోయినా భూములివ్వబోమన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 03:59 AM