Share News

Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:00 AM

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి

  • ఉపాధి హామీ సొమ్ము విడుదల చెయ్యండి

  • డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అలాగే, జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం రూ.1200 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 25 శాతం నిధులను విడుదల చేయకపోవడాన్ని ఆక్షేపించారు. ఈ మేరకు ఆయా నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు గురువారం ఓ లేఖ రాశారు. సచివాలయం ముందున్న రాజీవ్‌ గాంధీ విగ్రహం సాక్షిగా ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాలను తుంగలో తొక్కడం దారుణమని హరీశ్‌ పేర్కొన్నారు.


ఎనిమిది నెలలుగా నిధులు లేకపోవడంతో గ్రామాలు మురికి కుపాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందడం లేదని, పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు వేతన బకాయిలున్నాయని, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదని వివరించారు. అక్టోబరులో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ‘‘పంటల సాగులో మేటిగా.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. ధాన్యం ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ స్థానంతోపాటు పత్తి ఉత్పత్తిలో మూడోస్థానంలో నిలవడం గర్వకారణం’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇదంతా ఏదో మంత్రం వేస్తేనో.. మాయ చేస్తేనో జరిగింది కాదని, కేసీఆర్‌ తొమ్మిదేళ్ల కృషితో సాధించిన ఘనత అని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 04:00 AM