TG Politics: సీఎం రేవంత్ అందులో పోటీ పడుతున్నారు: హరీశ్‌రావు
ABN , Publish Date - Mar 15 , 2024 | 04:07 PM
6 గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మాట తప్పిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కిట్లు ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తిట్లలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్: 6 గ్యారంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మాట తప్పిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కిట్లు ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తిట్లలో పోటీ పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యిందని చెప్పారు. వంద రోజుల పాలన మూడు విచారణలు, ఆరు వేధింపులు అన్నట్లుగా ఉందని విమర్శించారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారన్నారు. రైతు రుణమాఫీని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లు పెంచుతామని.. ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ కరువును పెంచడానికి పోటీ పడుతుందని ఆరోపించారు. వ్యవసాయాన్ని శిథిలావస్థకు చేర్చుతున్నారని ధ్వజమెత్తారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని కాంగ్రెస్ నేత అంటున్నారని.. ఇది అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఆ పార్టీ ఇచ్చే ఘనత అని చెప్పారు.
కాంగ్రెస్ నేతలది నీచ రాజకీయం
మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ది యూ టర్న్, యూ ట్యూబ్‌ల పాలన అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు ఎత్తడం కాదని.. ముందుగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వ్యవసాయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. తాగడానికి నీళ్లు లేక జనం గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఖాళీ బిందెలు, వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 174 మంది రైతులు 30మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆత్మహత్యలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతీ నెల మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఏ మొహం పెట్టుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లడుగుతారని నిలదీశారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆక్షేపించారు. రైతులకు బోనస్ ఇచ్చి రుణమాఫీ చేసి ఓట్లు అడగాలని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రూ.500 బోనస్ అన్ని మోసమేనని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి