Harish Rao: రేవంత్ పెట్టింది డొల్లకేసు
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:03 AM
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి పెట్టించింది డొల్ల కేసు అనే విషయం హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లమైందని.. మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
హైకోర్టు ఉత్తర్వులతో ఆ విషయం తేటతెల్లం
తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం
ఫార్ములా రేస్ రద్దుతో రాష్ట్రానికి చెడ్డపేరు
బయటపడ్డ కాంగ్రెస్, బీజేపీ దోస్తానా: హరీశ్
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి పెట్టించింది డొల్ల కేసు అనే విషయం హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లమైందని.. మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతే లేనప్పుడు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) పరిధిలో కేసు ఎలాపెడతారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అరాచకాలు, అవినీతిని కేటీఆర్ బహిర్గతం చేసినందుకే.. కుట్రతో ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. ఫార్ములా ఈరే్‌సకు సంబంధించి రాష్ట్రానికి రూ.500 కోట్లు నష్టం కలగకుండా చూశానని ఆయన చెప్పడం సత్యదూరమని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాల కారణంగా.. ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ.600 కోట్ల ఆదాయం రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాక.. రేస్ నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వానికి ప్రపంచస్థాయిలో చెడ్డపేరు తెచ్చిపెట్టారని ఆయన విమర్శించారు. ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే బీఆర్‌ఎస్ సభ్యులను బయటకు పంపి చర్చించారని.. తమకు అవకాశమిస్తే ప్రజలకు వాస్తవాలు తెలిసేవని అన్నారు. ఈ రేస్ నిధుల చెల్లింపుల్లో క్రమరాహిత్యం ఉంది తప్ప.. చట్టవిరుద్ధంగా ఏం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం అంగీకరించారని చెప్పారు.
రాష్ట్రానికి ఆదాయం..
హైదరాబాద్‌లో 2020లో జరిగిన రేస్‌ను ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల మంది ప్రసారమాధ్యమాల ద్వారా వీక్షించారని హరీశ్ తెలిపారు. ఈ ఈవెంట్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి రూ.700కోట్ల ఆదాయం వచ్చినట్లు నీల్సన్ సంస్థ అధ్యయనంలో తేలిందని చెప్పారు. తమ హయాంలో ఈ ఈవెంట్‌కు 30 కోట్లు ఖర్చుపెడితే జీఎ్‌సటీ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.71 కోట్లు వచ్చిందని.. కాంగ్రెస్ సర్కార్ 45కోట్లు చెల్లించి ఈవెంట్ జరిపి ఉంటే రాష్ట్రానికి 600 కోట్ల లాభం వచ్చేదని పేర్కొన్నారు. రేవంత్ చర్యల వల్ల రాష్ట్ర పరపతి, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసు వివరాలు ఈడీ అడిగిందని వార్తల్లో చూశా. 18న సాయంత్రం దానకిశోర్ కేసు పెడితే.. 24గంటల్లోపు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి ఏసీబీకి కేసు అప్పగిస్తారా? ప్రాథమిక విచారణ జరగక ముందే ఈడీ వివరాలు అడిగిందా? ఇదంతా చూస్తే ఢిల్లీలో బడే భాయ్.. రాష్ట్రంలో ఛోటే భా య్ కుట్రపన్ని కేటీఆర్‌ను ఇరికిస్తున్నట్లు కనబడుతోంది’’ అని హరీశ్ ఆరోపించారు. ‘‘నిన్న నమోదయిన కేసులో వెంటనే ఈడీ జోక్యం వెనుక మతలబు ఏంటి? కాంగ్రెస్, బీజేపీ దోస్తానా బయటపడుతోంది’’ అని మండిపడ్డారు.