Share News

Ghatkesar: ఘట్‌కేసర్‌లో పెద్దఎత్తున ఇళ్ల కూల్చివేతలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:27 AM

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణం కోసం శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున ఇళ్లను కూల్చివేశారు.

Ghatkesar: ఘట్‌కేసర్‌లో పెద్దఎత్తున ఇళ్ల కూల్చివేతలు

  • భారీ పోలీసు బందోబస్తు నడుమ పనులు

  • ఒక్కరోజే 88 ఇళ్లను కూల్చివేసిన అధికారులు

ఘట్‌కేసర్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణం కోసం శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున ఇళ్లను కూల్చివేశారు. ఉదయం 7 గంటలకు రంగంలోకి దిగి 6 ఎక్స్‌కవేటర్లతో కూల్చివేతలు నిర్వహించారు. మొత్తం 88 ఇళ్లను కూల్చేశామని మరో 17 ఇళ్లకు స్టే ఉత్తర్వులు ఇచ్చామని అధికారులు తెలిపారు. పెద్దఎత్తున కూల్చివేతలు చేపట్టడంతో ఘట్‌కేసర్‌ బస్టాండ్‌ నుంచి ధర్మశాల వరకు ఆ ప్రాంతం శిథిలాల దిబ్బగా మారింది. 16 ఏళ్లుగా రైల్వే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో పాటు బాధితులు న్యాయపోరాటం చేయడంతో కూల్చివేతలు చేపట్టలేదు.


ఎట్టకేలకు ఇళ్ల కూల్చివేత పనులు పూర్తి కావడంతో అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. కాగా, తమ సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలేంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. కాగా ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ నాయకులు బాధితులతో చర్చించి వారికి తగిన పరిహారం ఇప్పించాలని అన్నారు. వారికి ఈ మాత్రం విజ్ఞత లేకపోవడం బాధాకారమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 05:27 AM