Train cancellations: భారీ వర్షాలతో 80 రైళ్ల రద్దు..
ABN , Publish Date - Sep 02 , 2024 | 03:42 AM
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను పూర్తిగా, 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 49 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించింది.
4 పాక్షికంగా.. 49 రైళ్ల దారి మళ్లింపు
సికింద్రాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను పూర్తిగా, 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 49 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించింది. తెలంగాణ, ఏపీ మధ్య, ఇరు రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను సోమవారం నుంచి శుక్రవారం వరకు (2 నుంచి 6వ తేదీ వరకు) రద్దు చేసింది. రైళ్ల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. కే.సముద్రం-ఇంటెకన్నె, తాడ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్య, రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. పలు రైళ్లు ముందుకెళ్లడానికి వీలు లేక వివిధ స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోయాయి.
బీబీనగర్-ఖాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా మరికొన్నింటిని బీబీనగర్-నల్లగొండ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నారు. వరంగల్ మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య అన్ని రైళ్లను రద్దు చేశారు. గోల్కొండ, కృష్ణ, ఇంటర్‌సిటీ, శాతవాహన, గోదావరి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి. ఆదివారం వరంగల్ మీదుగా వెళ్లాల్సిన పద్మావతి, సింహపూరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వరంగల్‌కు రాకుండా సికింద్రాబాద్ నుంచి కాచిగూడ మీదుగా దారి మళ్లించారు. న్యూఢిల్లీ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సిన రైళ్లను వరంగల్ రాకుండా కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు తరలించారు.
సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం బయలుదేరిన మచిలీపట్నం-బీదర్ ఎక్స్‌ప్రెస్ శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అర్ధరాత్రి నుంచి వరంగల్‌లో నిలిచిపోయిన ఈ రైలును ఆదివారం ఉదయం 7.30 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు పంపించారు. శనివారం రాత్రి నుంచి ఎలుగూరు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన పాటలీపుత్ర-యశ్వంత్‌పూర్, చింతల్‌పల్లి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌కు పంపించారు.
ఈ రైళ్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ డివిజనల్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసేలా ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలను నియమించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా, సోమవారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20701) 4 గంటలు ఆలస్యంగా ఉదయం 11.15 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.