Share News

Flooding: రాష్ట్రాన్ని వదలని వాన..

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:17 AM

వర్షాలు ఒకింత తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఊరట చెందేలోపే.. మంగళవారం అర్ధరాత్రి నుంచి కొన్నిజిల్లాల్లో.. బుధవారం ఉదయం నుంచి కొన్ని చోట్ల.. భారీ వర్షాలు దంచికొట్టాయి.

Flooding: రాష్ట్రాన్ని వదలని వాన..

  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉధృతంగా ప్రవహించిన వాగులు, వంకలు

  • అత్యధికంగా కోహెడలో 24 సెం.మీ. నమోదు

  • బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌.. ఓసీపీల్లో ఆగిన వెలికితీత

  • మరో 4 రోజులపాటు భారీ వర్షాలు

  • నేడు మరో అల్పపీడనం.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): వర్షాలు ఒకింత తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఊరట చెందేలోపే.. మంగళవారం అర్ధరాత్రి నుంచి కొన్నిజిల్లాల్లో.. బుధవారం ఉదయం నుంచి కొన్ని చోట్ల.. భారీ వర్షాలు దంచికొట్టాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి కోహెడ మండలం జలదిగ్బంధమైంది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం 9 గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్‌లో మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన వర్షం.. తీవ్ర రూపం దాల్చి ఉరుములు, మెరుపులతో రెండు గంటలపాటు కుంభవృష్టిగా కురిసింది.


నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు ఘట్‌కేసర్‌ మండలంలోని వెంకటాపూర్‌ అరుంధతి, వైభవ్‌కాలనీల్లో వరదనీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. అలాగే.. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ మరోసారి జలమయమైంది. కొన్ని హాస్టళ్ల సెల్లార్లలో నీరు చేరడంతో విద్యార్ధులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న 161 నంబరు నాందేడ్‌-అకోలా జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. దాదాపు 4 గంటలపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో హైవే అఽథారిటీ సిబ్బంది.. డీజిల్‌మోటార్లను తెప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిని ట్యాంకర్లతో తోడేసినా వరదనీటి ప్రవాహం తగ్గలేదు.


ఇక.. జోగులాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో చేరిన వరదనీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ అంతా గ్రామాన్ని చుట్టుముట్టి ఇళ్లలోకి చేరడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామంలోకి వస్తున్న తేళ్లు, పాముల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. బుధవారం గ్రామానికి చెందిన రైతు వడ్డె మల్లేష్‌ (18) నారుమడిలో నారు తీయడానికి వెళ్లి విషపురుగు కాటుకు బలయ్యాడు. ఇక.. హైదరాబాద్‌ నగరంలోనూ.. మంగళవారం రాత్రి 11గంటల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకూ పలు ప్రాంతాల్లో 8.7 నుంచి 5 సెం.మీ వర్షం కురిసింది.


  • ఇంకా వర్షాలే..

నగరంలో మరో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా రానున్న నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


గురువారం బంగాళాఖాతంలో.. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓపెన్‌కా్‌స్ట గనుల్లో వర్షపు నీరు చేరడం వల్ల ఓవర్‌ బర్డెనింగ్‌ సహా ఇతర పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భూపాలపల్లి ఏరియాలో రోజుకు 47,146 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడిందని సింగరేణి వర్గాలు తెలిపాయి. అలాగే.. వర్షాల కారణంగా మంచిర్యాలజిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోగా, ఓబీ తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. .

Updated Date - Sep 05 , 2024 | 04:17 AM