Share News

Heavy Rains: ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు.. తెగిన రోడ్లు

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:19 AM

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా.. 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.

Heavy Rains: ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు.. తెగిన రోడ్లు
Heavy Rains

  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో

  • 16.7 సెంటీమీటర్ల వర్షపాతం

  • సగానికి పైగా నిండిన తుంగభద్ర

  • జూరాలను చేరిన కృష్ణా జలాలు

  • నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు

  • 5 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

1 copy.jpg

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా.. 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వానలతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లగా.. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో అత్యధికంగా 16.7 సెం.మీ., అదే జిల్లా పెంచికల్‌పేటలో 15.4, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 15.2, అదే జిల్లా కోటపల్లిలో 13.6, పెద్దపల్లి జిలా మంథని మండలంలో 12.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. బెజ్జూర్‌ మండలం కొత్తగూడలో భారీ వర్షానికి సోమిని-కృష్ణపల్లి గ్రామాల మధ్య లోలెవల్‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఏదులబందంలో తుతుంగ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయి సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా శ్రీరాంపూర్‌లోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం ఆలుబాకకు చెందిన బానారి రాజు అనే వ్యక్తి గోదావరిలో గల్లంతయ్యాడు. చేపలు పట్టేందుకు వెళ్లి వరదలో కొట్టుకుపోయాడు.


లభ్యం కానీ ఆచూకీ..

నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో ఆచూకీ లభ్యం కాలేదు. వాజేడు బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో గురువారం రాత్రి వర్షానికి స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి కంప్యూటర్లు ధ్వంసమవగా.. దస్తావేజులు దెబ్బతిన్నాయి. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాల్లో పత్తి, వరి పంటకు నష్టం వాటిల్లిందని సమాచారం. అదే జిల్లా కాటారం మండలంలో అలుగువాగు వద్ద బొలెరో వాహనం కొట్టుకుపోగా డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా మూడో రోజూ వర్షం కురిసింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రానికి 26.5 అడుగులకు చేరుకుంది.


ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద

కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం సగానికి పైగా నిండింది. శుక్రవారం సాయంత్రానికి ఈ జలాశయానికి 1,07,632 క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్ర పూర్తి స్థాయి సామర్థ్యం 105.79 టీఎంసీలకు.. ప్రస్తుతం 59.80 టీఎంసీలు ఉన్నాయి. ఇక తుంగభద్ర ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండిపోయాయి. ఇక జూరాల ప్రాజెక్టును కృష్ణా జలాలు తాకాయి. ఈ ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... జలవిద్యుదుత్పాదనతో 37,905 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 32,673 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. నాగార్జునసాగర్‌కు 8,462 కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. కాలువల ద్వారా 6,145 కూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు 17,283 క్యూసెక్కులు వరద వస్తోంది. సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీకి 3.75 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం)కు 3.47 లక్షల క్యూసెక్కులు, అదే మేడిగడ్డకు 3.41 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 12,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.


రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు..

రాష్ట్రంలో రెండ్రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారానికి ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి.. ఈ ఐదు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.


వరదలపై గంటకో సారి సమీక్షించండి: ఉత్తమ్‌

భారీ వర్షాల నేపథ్యంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరదను గంటకోసారి పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల గేట్లను మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని సూచించారు. కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడటాన్ని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ప్రాజెక్టుల నుంచి వరదను వదిలే క్రమంలో దిగువ ప్రాంతాల్లో తగిన హెచ్చరికలు జారీ చేయాలని, దీనికోసం స్టాండింగ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ పాటించాలన్నారు. ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చూసుకోవాలన్నారు.


అప్రమత్తం

క్షేత్రస్థాయిలోని ఎస్‌ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈలు అందుబాటులో ఉండాలన్నారు. చీఫ్‌ ఇంజనీర్లు ఎవరూ కూడా హెడ్‌క్వార్టర్‌ను వీడరాదని నిర్దేశించారు. ఇటు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టులు, కాలువల గేట్లన్నీ పనిచేస్తున్నాయా? లేవా? అనే అంశాలను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. భారీ వర్షాలతో ‘మెరుపు వరదలు’ వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నివాసముంటున్న వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.

Updated Date - Jul 20 , 2024 | 08:09 AM