Crop Damage: నిండా ముంచిన వానలు..
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:53 AM
ఈ ఏడాది వానాకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన అన్నదాతలను వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.
నీట మునిగిన పత్తి, వరి, మిర్చి పంటలు
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్
జిల్లాల్లో భారీగా దెబ్బతిన్న పంటలు
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఈ ఏడాది వానాకాలం పంటల సాగు సానుకూలంగా ఉందని భావించిన అన్నదాతలను వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పంటలన్నీ నీట మునగడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మిర్చి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుప్రాథమిక అంచనా. జిల్లాలోని రఘునాధపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మంఅర్బన్, ఖమ్మం రూరల్, చింతకాని, కూసుమంచి, మధిర, ఎర్రుపాలెం, వైరా, కొణిజర్ల, కారేపల్లి, కామేపల్లి మండలాల్లోని అధిక నష్టం జరిగింది.
అయితే పంటల నష్టంపై ఉమ్మడి జిల్లాలో వ్యవసాయాధికారులు పూర్తిస్థాయి సర్వే సాగిస్తున్నారు. తెల్లబంగారం సాగుద్వారా ఈఏడాది కష్టాలు గట్టెక్కుతాయని ఆశించిన రైతులు వరద నష్టంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలకు పంటలు కూడా దెబ్బతిన్నాయి. నష్టం మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి, కంది, మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయి. నారాయణపేట జిల్లాలో కంది పంటకు బాగా నష్టం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్ పంట నీట మునగడంతో రైతన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. వ్యవసాయంపైనే ఆధారపడ్డ తమను వర్షాలు నిండా ముంచాయని, పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ నష్టం 4 లక్షల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉదని, నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు.