Khammam: వరద సహాయక చర్యల కోసం.. ఖమ్మంకు హెలికాప్టర్, విమానం?
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:25 AM
ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెండు హెలికాప్టర్లను పంపాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సీఎస్ శాంతికుమారిని కోరారు.
వాతావరణం అనుకూలించక విజయవాడలోనే పార్క్
హైదరాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెండు హెలికాప్టర్లను పంపాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సీఎస్ శాంతికుమారిని కోరారు. అయితే, హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్నందున హెలీకాప్టర్లను పంపడం సాధ్యపడలేదు. మరోవైపు, ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్ పంపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అక్కడి అధికారులతోనూ తుమ్మల మాట్లాడారు. అయితే అక్కడ కూడా వర్షాలు కురుస్తుండటంతో హెలికాప్టర్ పంపడం సాధ్యంకాలేదు.
ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను తీసుకురావాలని మంత్రి పొంగులేటి ప్రయత్నించారు. హైదరాబాద్, విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లను రప్పించేందుకు కృషి చేశారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖపట్నంలోని నేవీ అధికారులకు ఫోన్ చేసి రెండు హెలికాప్టర్లను పంపాలని కోరారు. స్పందించిన నేవీ విభాగం సీ కింగ్ హెలికాప్టర్‌తో పాటు డోర్నియర్ విమానాన్ని ఖమ్మం పంపేందుకు అంగీకరించింది.
ఈ రెండూ విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి ఖమ్మం వెళ్లి సహాయక చర్యలను అందిస్తాయి. ఖమ్మంలో ఎయిర్‌పోర్టు లేకపోవడంతో.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులున్నాయనే విషయాన్ని విమానం ద్వారా సేకరించి, ఆ వివరాలను అధికారులకు అందజేస్తుంటారు. అనంతరం సీ కింగ్ హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను చేపడతారు. అయితే, ఖమ్మం వెళ్లేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ రెండు లోహ విహంగాలు ప్రస్తుతం విజయవాడలో ఉన్నాయి. హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించగానే ఖమ్మం జిల్లా లేదా రాష్ట్రంలో ఎక్కడ అవసరమైనా సహాయక చర్యలను అందించేందుకు హైదరాబాద్‌లోని హకీంపేటలో చేతక్ హెలికాప్టర్‌ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని అధికార వర్గాలు వెల్లడించాయి.