High Court: స్టే ఉండగా ఎలా కూల్చుతారు?
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:02 AM
అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా?
హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్
తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి: హైకోర్టు
ఆదివారం కూల్చొద్దని సుప్రీం చెప్పింది
బాధితులకు అవకాశం ఇవ్వకపోవడం అక్రమం
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాన్ని ఎలా కూల్చారని నిలదీసింది. ఏ అధికారం, ఏ చట్టప్రకారం ఇళ్ల కూలివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రాకు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండగా, జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ పంచాయతీ శ్రీకృష్ణనగర్ ప్లాట్ నెంబర్ 92 (సర్వే నంబరు 165, 166)లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ భవనాన్ని ఈ నెల 22న కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం 7.30 గంటలకు కూల్చివేతలు చేపట్టడం అక్రమమని పేర్కొంది. ఏ అధికారంతో ఇలా చేస్తున్నారో స్వయంగా వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. కమిషనర్ రంగనాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్ ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. అన్ని అనుమతులు పొంది, ఆస్తులు విక్రయించి, అప్పులు తెచ్చి హాస్పిటల్ కోసం ఐదంతస్తుల భవనాన్ని నిర్మించామని.. భూ ఆక్రమణ చట్టం-1905 కింద 48 గంటల నోటీసు ఇచ్చి 13 గంటల్లో భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ మహమ్మద్ రఫీ, ఎన్.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున జి.నరేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 1985లో వేసిన లేఅవుట్‌లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా స్థలం కొని, అన్ని అనుమతులతో భవనం నిర్మించామని.. నాలుగు నెలల కిందే నూతన భవనంలో హాస్పిటల్ ప్రారంభించామని తెలిపారు. ఈ ఆస్తి విషయంలో జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నాయన్నారు. అక్రమ నిర్మాణాలని పేర్కొంటున్న రెవెన్యూ అధికారులు సదరు భూముల్లో సర్వే చేయకుండా, హద్దులు గుర్తించకుండా కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. తహసీల్దార్ తప్పుడు తేదీతో నోటీసు సిద్ధం చేసి, కేవలం 48 గంటల ముందు అందజేశారని.. దానిపై వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా కూల్చివేశారని వాపోయారు.
వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి పరిహారం క్లెయిం చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. తహసీల్దార్ సూచన మేరకు పత్రాలేవీ పరిశీలించకుండానే హైడ్రా రంగంలోకి దిగడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. హైడ్రా ఏర్పాటు జీవోలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా ఎలా ముందుకు వెళ్తుందని? అసలు ఏ అధికారంతో కూల్చివేతలు చేపడుతుందో చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్, తహసీల్దార్ హాజరుకావాలని పేర్కొంటూ విచారణను 30కి వాయిదా వేసింది.